IND vs SL: అందుకే సిరాజ్‌తో 7 ఓవర్లే వేయించా: రోహిత్ శర్మ

ABN , First Publish Date - 2023-09-18T15:32:36+05:30 IST

వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ ఊపు మీదున్న సిరాజ్‌కు మరో ఓవర్ ఇవ్వాల్సిందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. సిరాజ్‌కు మరో ఓవర్ ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడేవనేది వారి అభిప్రాయం. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ అంశంపై స్పష్టతనిచ్చాడు.

IND vs SL: అందుకే సిరాజ్‌తో 7 ఓవర్లే వేయించా: రోహిత్ శర్మ

కొలంబో: ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో అతిథ్య జట్టు శ్రీలంకను టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ వణికించాడు. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు తీయడంతోపాటు మొత్తంగా 6 వికెట్లు తీసి శ్రీలంక నడ్డి విరిచాడు. దీంతో 15.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన లంక జట్టు 50 పరుగులకే కుప్పకూలింది. లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలోనే చేధించి ఆసియా కప్ 2023 విజేతగా నిలిచింది. అయితే వరుస ఓవర్లలో వికెట్లు తీస్తూ ఊపు మీదున్న సిరాజ్‌కు మరో ఓవర్ ఇవ్వాల్సిందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. సిరాజ్‌కు మరో ఓవర్ ఇచ్చి ఉంటే మరిన్ని వికెట్లు పడేవనేది వారి అభిప్రాయం. అయితే మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఈ అంశంపై స్పష్టతనిచ్చాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘‘ఫాస్ట్ బౌలర్ల పని తీరు చూసినప్పుడు నాకు చాలా సంతృప్తి కల్గింది. కెప్టెన్లందరూ వారి వద్ద ఉన్న ఫాస్ట్ బౌలింగ్‌ను గర్వంగా భావిస్తారు. నేను దానికి భిన్నంగా ఏమి లేను. మా వద్ద అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. మా పేసర్లు విభిన్న నైపుణ్యాలు, వైవిధ్యాలను కల్గి ఉన్నారు. ఒకరు వేగంగా బౌలింగ్ చేయగలరు. మరొకరు బంతిని స్వింగ్ చేయగలరు. ఇంకొకరు మంచి బౌన్స్ రాబట్టగలరు. ఇలాంటి వారంతా ఒకే జట్టులో ఉంటే మంచి అనుభూతి కల్గుతుంది.’’ అని చెప్పాడు.


సిరాజ్‌లో ఇలాంటి లక్షణాలన్ని ఉండడం విశేషమని రోహిత్ శర్మ తెలిపాడు. సిరాజ్ బంతిని స్వింగ్, పేస్, బౌన్స్ చేయగలడని, అతడి ఏడు ఓవర్ల స్పెల్‌లో వీటన్నింటినీ చూశామని చెప్పాడు. ‘‘స్లిప్స్ నుంచి సిరాజ్ బౌలింగ్‌ను చూడడం ఆనందంగా ఉంది. సిరాజ్ బౌలింగ్‌లో వేగం మిగతా ఇద్దరి కంటే ఎక్కువగా ఉంది. సిరాజ్ తన స్పెల్‌లో నిర్విరామంగా ఏడు ఓవర్లు వేశాడు. దీంతో అతడికి కాస్త విశ్రాంతి ఇవ్వాలని ట్రైయినర్ నుంచి సందేశం వచ్చింది. దీంతో సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాతో బౌలింగ్ చేయించాను. హార్దిక్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టడంతో సిరాజ్‌కు మళ్లీ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. గతంలో ఇదే శ్రీలంకతో తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ వరుసగా 8-9 ఓవర్లు బౌలింగ్ చేశాడు. వన్డే ప్రపంచకప్ సమీస్తున్న నేపథ్యంలో అతడిపై ఎక్కువ ఒత్తిడిపడకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.’’ అని రోహిత్ శర్మ చెప్పాడు.

అలాగే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై కూడా రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిలో కుల్దీప్ చాలా బాగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. గత రెండు సంవత్సరాలుగా కుల్దీప్ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అతను జట్టును ఎలాంటి పరిస్థితి నుంచైనా తిరిగి మ్యాచ్‌లోకి తీసుకురాగలడని చెప్పుకొచ్చాడు. ఇక ఆసియా కప్ విజయం జట్టుకు సరైన సమయంలో వచ్చిందన్నాడు. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌నకు ముందు ఆసియాకప్ విజయం ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. ఈ టోర్నమెంట్ అంతా కుర్రాళ్ళు ఒత్తిడిలో రాణించారని రోహిత్ శర్మ కొనియాడాడు.

Updated Date - 2023-09-18T15:32:36+05:30 IST