IND vs SL: 53 పరుగులు.. 6 రికార్డులు.. రోహిత్ శర్మ ఊచకోత!

ABN , First Publish Date - 2023-09-12T19:50:31+05:30 IST

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమైనప్పటికీ హిట్‌మ్యాన్ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు.

IND vs SL: 53 పరుగులు.. 6 రికార్డులు.. రోహిత్ శర్మ ఊచకోత!

కొలంబో: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమైనప్పటికీ హిట్‌మ్యాన్ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు. 7 ఫోర్లు, 2 సిక్సులతో 48 బంతుల్లోనే 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 6 రికార్డులను కూడా అందుకున్నాడు.


10,000- ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా రోహిత్ శర్మ తన వన్డే కెరీర్‌లో 10 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. హిట్‌మ్యాన్ 241 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కు అందుకున్నాడు. దీంతో వన్డేల్లో వేగంగా 10 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 259 ఇన్నింగ్స్‌లో 10 వేల పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్‌ను రోహిత్ అధిగమించాడు. ఈ ఘనత సాధించిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా 15వ ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లోనే 10 వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.

8,000- ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా రోహిత్ శర్మ ఓపెనర్‌గా 8 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో వేగంగా ఈ ఘనత సాధించిన ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.

10- ఈ మ్యాచ్‌లో చేసిన హాఫ్ సెంచరీ ద్వారా ఆసియా కప్ చరిత్రలో రోహిత్ శర్మ 10 సార్లు 50+ రన్స్ చేశాడు. దీంతో ఆసియా కప్ చరిత్రలో 10 సార్లు 50+ రన్స్ చేసిన తొలి టీమిండియా ఆటగాడిగా నిలిచాడు.

28- ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 2 సిక్సులు కొట్టాడు. దీంతో ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహీద్ ఆఫ్రిది(26)ని అధిగమించాడు.

5,000- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఈ మ్యాచ్‌లో 10 పరుగుల భాగస్వామమే నెలకొల్పారు. కానీ తమ వన్డే కెరీర్‌లో ఇద్దరు కలిసి 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. 86 ఇన్నింగ్స్‌లో 62 సగటుతో ఈ మార్కు అందుకున్నారు. ఇందులో 15 సార్లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు, 18 సార్లు సెంచరీ భాగస్వామ్యాలున్నాయి. కాగా వన్డేల్లో 4 వేల పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల్లో రోహిత్-కోహ్లీదే అత్యధిక సగటు కావడం గమనార్హం.

194- ఈ మ్యాచ్‌లో చేసిన రన్స్ ద్వారా ఆసియా కప్ 2023లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 194 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

Updated Date - 2023-09-12T19:53:58+05:30 IST