IND vs WI 3rd ODI: సూర్యకుమార్ యాదవ్‌కు డూ ఆర్‌ డై.. తుది జట్టులో 3 మార్పులు? టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

ABN , First Publish Date - 2023-07-30T15:24:03+05:30 IST

టెస్టు సిరీస్ ఓటమికి వన్డే సిరీస్ విజయంతో ప్రతీకారం తీర్చుకోవాలని అతిథ్య వెస్టిండీస్ భావిస్తోంది. కాగా 2006 తర్వాత విండీస్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా ఒకసారి కూడా ఓడిపోలేదు. దీంతో ఈ సారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో మూడో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.

IND vs WI 3rd ODI: సూర్యకుమార్ యాదవ్‌కు డూ ఆర్‌ డై.. తుది జట్టులో 3 మార్పులు? టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!

బార్బడోస్: సిరీస్‌లోని మొదటి రెండు వన్డేలను భారత్, వెస్టిండీస్ చెరొకటి గెలవడంతో మూడో వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సిరీస్ విజేతగా నిలవనుండడంతో రెండు టీంలు తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అతి ఆత్మవిశ్వాసంతో రెండో వన్డేలో ఓడిన టీమిండియా చివరిదైనా మూడో వన్డే మ్యాచ్‌లో ఆ తప్పు జరగకుండా చూసుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ మినహా మిగతా వారంతా విఫలమవుతున్నారు. దీంతో బ్యాటింగ్‌లో రాణించడంపై ప్రధానంగా ద‌ృష్టి సారించారు. మరోవైపు టెస్టు సిరీస్ ఓటమికి వన్డే సిరీస్ విజయంతో ప్రతీకారం తీర్చుకోవాలని అతిథ్య వెస్టిండీస్ భావిస్తోంది. కాగా 2006 తర్వాత విండీస్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా ఒకసారి కూడా ఓడిపోలేదు. దీంతో ఈ సారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో మూడో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. అయితే మొదటి రెండు వన్డే మ్యాచ్‌లు జరిగిన ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోనే మూడో వన్డే మ్యాచ్ కూడా జరగనుంది.


ఈ మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో ప్రధానంగా మూడు మార్పులు జరిగే అవకాశాలున్నాయి. రెండో వన్డేకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. దీంతో వారి స్థానాల్లో గత మ్యాచ్‌లో బరిలోకి దిగిన సంజూ శాంసన్, అక్షర్ పటేల్ మూడో వన్డేకు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇక మొదటి రెండు వన్డేల్లో రాణించలేకపోయినా పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను మూడో వన్డేలో ఆడించడం అనుమానంగా కనిపిస్తుంది. అతని స్థానంలో జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం ఇవ్వొచ్చు. విండీస్ పర్యటనలో రాణించలేకపోతున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ స్థానానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఢోకా ఏంలేదు. దీంతో జట్టులో చోటు ఆశిస్తున్న మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బెంచ్‌పైనే ఉండే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఈ సారి విండీస్ పర్యటనలో టెస్టులు, వన్డేలకు ఎంపికైనప్పటికీ ఒక్కసారి కూడా తుది జట్టులో చోటు దక్కని ఆటగాడిగా రుతురాజ్ నిలిచిపోతాడు. ఇక ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ రాణిస్తున్నాడు కాబట్టి చాహల్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.

ముఖ్యంగా ఈ మ్యాచ్ మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు కీలకంగా మారింది. సూర్యకు రానున్న ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కాలంటే తన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి అతనికి ఇదే చివరి అవకాశంగా చెప్పుకోవచ్చు. సూర్య టీ20ల్లో అదరగొడుతున్న వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు. గత 10 ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ఒక సారి కూడా హాఫ్ సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో ఆడిన మొదటి రెండు వన్డేల్లోనూ 43 పరుగులే చేశాడు. అంతేకాకుండా కెరీర్లో ఇప్పటివరకు 25 వన్డే మ్యాచ్‌లు ఆడిన సూర్య ఒక సారి కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 23 సగటుతో 476 పరుగులే చేశాడు. రెండు సార్లు మాత్రమే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. ఆసియాకప్‌లో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఆడే అవకాశాలు ఉండడంతో సూర్యకు చోటు దక్కడం కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఒక వేళ మూడో వన్డేలో భారీ ఇన్నింగ్స్ ఆడితే రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఎంట్రీతో సంబంధం లేకుండా సూర్యకు కూడా జట్టులో చోటు దక్కొచ్చు. లేదంటే వేటు తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక మూడో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే అవకాశాలున్నాయి.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్

Updated Date - 2023-07-30T15:24:03+05:30 IST