IND vs WI 3rd T20: ద్రావిడ్ బాటలో హార్దిక్.. అప్పుడు సచిన్, ఇప్పుడు తెలుగోడికి అన్యాయం.. భగ్గుమంటున్న ఫ్యాన్స్!

ABN , First Publish Date - 2023-08-09T15:39:54+05:30 IST

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్(Hardik Pandya) పాండ్యా ఇటీవల వరుసగా విమర్శలకు గురవుతున్నాడు. వన్డే సిరీస్ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(west indies cricket board) సరైన వసతులు కల్పించడంలేదని మాట్లాడి పలువురు నుంచి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక మొదటి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురిసింది.

IND vs WI 3rd T20: ద్రావిడ్ బాటలో హార్దిక్.. అప్పుడు సచిన్, ఇప్పుడు తెలుగోడికి అన్యాయం.. భగ్గుమంటున్న ఫ్యాన్స్!

గయానా: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్(Hardik Pandya) పాండ్యా ఇటీవల వరుసగా విమర్శలకు గురవుతున్నాడు. వన్డే సిరీస్ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(west indies cricket board) సరైన వసతులు కల్పించడంలేదని మాట్లాడి పలువురు నుంచి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక మొదటి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురిసింది. తాజాగా మూడో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెలువెత్తున్నాయి. ఆ మ్యాచ్‌లో భారత్ విజయానికి 2 పరుగులు కావాల్సిన సమయంలో హార్దిక్ పాండ్యా సిక్సు కొట్టడమే ఈ విమర్శలకు కారణం. ఆ మ్యాచ్‌లో టీమిండియా విజాయానికి చివరి 14 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులు హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ(Tilak Varma) ఉన్నారు. తిలక్ 49 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. మరొక పరుగు చేస్తే హాఫ్ సెంచరీ పూర్తవుతుంది. పావెల్(Rovman Powell) వేసిన 18వ ఓవర్ ఐదో బంతికి హార్దిక్ స్ట్రైక్‌లో ఉన్నాడు. తిలక్ హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉండడంతో హార్దిక్ పాండ్యా సింగిల్ తీసి అతనికి బ్యాటింగ్ ఇస్తాడని అనుకున్నారంతా.. కానీ అలా జరగలేదు. హార్దిక్ పాండ్యా ఏకంగా సిక్సు కొట్టి మ్యాచ్‌ను ముగించేశాడు. దీంతో భారత జట్టు మరో 13 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టడంతో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయడానికి అవకాశం లేకుండాపోయింది.


దీంతో సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాపై అభిమానులు మండిపడుతున్నారు. హార్దిక్ పాండ్యా స్వార్థపరుడని, తిలక్ వర్మను హాఫ్ సెంచరీ చేసుకోనివ్వలేదని అంటున్నారు. రన్‌రేటు మెరుగుపరచుకోవడానికి ఇది టోర్నీ కూడా కాదని, అలాంటప్పుడు తిలక్ వర్మకు బ్యాటింగ్ ఇవ్వడానికి హార్దిక్‌కు సమస్య ఏంటని ప్రశ్నిస్తున్నారు. మన తెలుగోడికి హార్దిక్ పాండ్యా అన్యాయం చేశాడని రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులు సైతం పెదవి విరుస్తున్నారు. మరికొందరేమో హార్దిక్ కొట్టిన సిక్స్ అత్యంతగా అసహించుకునేదని చెబుతున్నారు. యువ ఆటగాడైనా తిలక్ వర్మను హాఫ్ సెంచరీ పూర్తి చేయనించి ఉంటే అతనికి ఆత్మవిశ్వాసం పెరిగేదని అంటున్నారు. అటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా హార్దిక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదే సమయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై(Rahul Dravid) కూడా విమర్శలు చేస్తున్నారు. 2001-02 పాకిస్థాన్ పర్యటనలో(india vs pakistan) సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) డబుల్ సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో ఉన్నాడు. సరిగ్గా 194 పరుగుల వద్ద ఉన్న సమయంలో అప్పటి టీమిండియా కెప్టెన్ ద్రావిడ్ స్కోర్‌ను అనూహ్యంగా డిక్లేర్ చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో ద్రావిడ్ స్వార్థపరుడని ఆ సమయంలో విమర్శలు వెలువెత్తాయి. ఆ మ్యాచ్‌లోనే వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ట్రిపుల్ సెంచరీ కూడా కొట్టాడు. మ్యాచ్‌లో టీమిండియా గెలిచిన ద్రావిడ్‌ మాత్రం తీవ్రమైన విమర్శలను ఎదుర్కొవలసి వచ్చింది. తాజాగా రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే హార్దిక్ పాండ్యా ఈ నిర్ణయం తీసుకోవడంతో నాటి ఘటనను పలువురు గుర్తు చేస్తూ ఇద్దరిపై మండిపడుతున్నారు. ద్రావిడ్ బాటలోనే హార్దిక్ పాండ్యా కూడా నడిచాడని అంటున్నారు.

మరికొందరైతే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని(mahendra singh dhoni) చూసి బుద్ధి తెచ్చుకోమని హార్దిక్‌కు సూచిస్తూ నాటి సంఘటనను గుర్తు చేస్తున్నారు. కాగా 2014 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత జట్టు సౌతాఫ్రికా విసిరిన 172 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఒక్క పరుగు దూరంలో ఉంది. విరాట్ కోహ్లీ(Virat Kohli) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగి భారత్‌ను విజయానికి చేరువ చేశాడు. అయితే సరిగ్గా అదే సమయంలో సురేష్ రైనా(Suresh Raina) ఔటవడంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు టీమిండియా గెలుపునకు 7 బంతుల్లో ఒక్క పరుగు అవసరం. కానీ ధోనీ ఆ ఒక్క పరుగు చేయకుండా కావాలని డిఫెన్స్ ఆడి విన్నింగ్ షాట్ కొట్టే బాధ్యతను కోహ్లీకి అప్పగించాడు. ఎందుకంటే అప్పట్లో యువ ఆటగాడైనా కోహ్లీ స్వయంగా మ్యాచ్‌ను ఫినిష్ చేస్తే అతని ఆత్మవిశ్వాసం పెరుగుతుందనేది ధోనీ ఉద్దేశ్యం. అయితే తాజా ఘటనలో కొందరు హార్దిక్‌కు మద్దతుగా కూడా నిలుస్తున్నారు. వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు గెలుపు కోసం మ్యాచ్‌లు ఆడాలనే ఉద్దేశ్యంతో హార్దిక్ పాండ్యా అలా చేసి ఉండొచ్చని అంటున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే వెస్టిండీస్‌తో జరిగిన కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం లక్ష్యాన్ని టీమిండియా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. సూర్యకుమార్ యాదవ్(83), తిలక్ వర్మ(49) టీమిండియా విజయంలో కీలకపాత్ర పొషించారు. కాగా ఈ సిరీస్‌లో అద్భుతంగా ఆడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇప్పటివరకు ముగిసిన మూడు మ్యాచ్‌ల్లో 39, 51, 49(నాటౌట్) పరుగులు చేశాడు.

Updated Date - 2023-08-09T16:33:39+05:30 IST