ODI World Cup: గుడ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ.. వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీతో కలిసి..

ABN , First Publish Date - 2023-08-21T15:46:56+05:30 IST

రానున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మనే స్పష్టం చేశాడు.

ODI World Cup: గుడ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ.. వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీతో కలిసి..

రానున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మనే స్పష్టం చేశాడు. ఆసియా కప్‌ 2023కి టీమిండియాను ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రోహిత్ శర్మ ఈ విషయాన్ని వెల్లడించాడు. వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీతో కలిసి తాను కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తానని పేర్కొన్నాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో జట్టుకు అవసరమైనప్పుడు రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేయనున్నారు. టీమిండియాను పార్ట్ టైమ్ బౌలర్ల కొరత వేధిస్తున్న సమయంలో రోహిత్, కోహ్లీ బౌలింగ్ చేయడానికి ముందుకు రావడం శుభ పరిణామని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ సందర్భంగా గతంలో సచిల్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి వాళ్లు పార్ట్ టైమ్ బౌలర్లుగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.


నిజానికి రోహిత్, కోహ్లీ పార్ట్ బౌలర్లుగా గతంలో పలుమార్లు బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే కెరీర్ ఆరంభంలో బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ చురుకుగా ఉండేవాడు. స్పిన్ బౌలింగ్ చేసే హిట్‌మ్యాన్ పార్ట్ టైమ్ బౌలర్‌గా పలు వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో రోహిత్ పేరు మీద హ్యాట్రిక్ వికెట్ల రికార్డు కూడా ఉంది. కానీ కుడి చేతి వేలికి ఆపరేషన్ అయ్యాక బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ టెస్టుల్లో 2, వన్డేల్లో 8, టీ20ల్లో ఒక వికెట్ తీశాడు. ఐపీఎల్‌లో 15 వికెట్లు తీశాడు. మీడియం పేసరైన కోహ్లీ కూడా పార్ట్ బౌలర్‌గా రాణించాడు. కెరీర్ ఆరంభంలో వికెట్లు తీశాడు. ఇప్పటివరకు వన్డేలు, టీ20లు, ఐపీఎల్‌లో నాలుగేసి చొప్పున వికెట్లు పడగొట్టాడు.

ఇక ఆసియా కప్ 2023కు సెలెక్టర్లు 17 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేశారు. వన్డే ప్రపంచకప్‌నకు కూడా ఇదే జట్టును కొనసాగించే అవకాశాలున్నాయి. ఆసియా కప్‌నకు ఎంపిక చేసిన భారత జట్టులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కూడా చోటు దక్కడం విశేషం. ముందుగా అనుకున్నట్టుగానే గాయాల కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చారు. అయితే లెగ్ స్పిన్నర్ చాహల్‌ను పక్కనపెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వన్డేల్లో వరుసగా విఫలమవుతున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌కు సెలెక్టర్లు మరో అవకాశం ఇచ్చారు. అవకాశాలు ఇస్తున్నప్పటికీ రాణించలేకపోతున్న సంజూ శాంసన్‌ను స్టాండ్ బై ఆటగాడిగా ఎంపిక చేశారు.

టీమిండియా స్క్వాడ్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (స్టాండ్ బై)

Updated Date - 2023-08-21T15:52:06+05:30 IST