Asia Cup 2023: మస్తు సంతోషంగా ఉన్న రోహిత్ శర్మ.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-08-21T16:39:42+05:30 IST

రానున్న ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌నకు ఆటగాళ్లంతా అందుబాటులో ఉండడం పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరిగే రోజు ఆటగాళ్లంతా జట్టుకు అందుబాటులో ఉంటే తాను చాలా సంతోషిస్తానని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Asia Cup 2023: మస్తు సంతోషంగా ఉన్న రోహిత్ శర్మ.. ఎందుకంటే..?

రానున్న ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌నకు ఆటగాళ్లంతా అందుబాటులో ఉండడం పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరిగే రోజు ఆటగాళ్లంతా జట్టుకు అందుబాటులో ఉంటే తాను చాలా సంతోషిస్తానని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా సంవత్సర కాలంగా భారత జట్టును గాయాలు వేధిస్తున్న సంగతి తెలిసిందే. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు జట్టుకు అందుబాటులో ఉండడం లేదు. తాజాగా ఆసియా కప్‌తోనే ఆటగాళ్లంతా గాయాల నుంచి కోలుకుని జట్టుకు అందుబాటులోకి వచ్చారు. దీంతో ఆసియా కప్‌నకు జట్టును ప్రకటించిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో హిట్‌మ్యాన్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ‘‘ఆటగాళ్లంతా జట్టుకు అందుబాటులో ఉన్నప్పుడు నేను టీమ్ షీట్ చూసి సంతోషిస్తాను’’ అని చెప్పుకొచ్చాడు. గాయాల కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఆసియా కప్‌లో బరిలో దిగుతున్నారు.


కాగా వెస్టిండీస్ పర్యటన ప్రారంభానికి ముందు కూడా రోహిత్ ఈ విషయంపై మాట్లాడాడు. టీమిండియా ఈ సారి ప్రపంచకప్ గెలుస్తుందా? అనే ప్రశ్నకు బదులుగా.. అందుకోసం తనకు ముందుగా తన ఆటగాళ్లంతా గాయాల నుంచి కోలుకుని జట్టుకు అందుబాటులో ఉండాలని చెప్పుకొచ్చాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2022 టీ20 ప్రపంచకప్‌నకు గాయాల కారణంగా జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే ఇంటి దారి పట్టింది. ఇక గత జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా కీలక ఆటగాళు దూరమవడంతో టీమిండియా ఓటమి పాలైంది. ఆ ఫైనల్ మ్యాచ్‌లో గాయాల కారణంగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ టీమిండియాకు దూరమయ్యారు. ప్రస్తుతం రిషబ్ పంత్ మినహా మిగతా ఆటగాళ్లంతా గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నారు. నిజానికి పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యే సమయానికి ఫామ్ లేమితో వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. అలాగే రానున్న వన్డే ప్రపంచకప్‌లో జట్టు అవసరాలకు అనుగుణంగా తాను విరాట్ కోహ్లీ బౌలింగ్ కూడా చేస్తామని రోహిత్ శర్మ తెలిపాడు.

టీమిండియా స్క్వాడ్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (స్టాండ్ బై)

Updated Date - 2023-08-21T16:43:10+05:30 IST