Kadem project: వణికిస్తున్న ‘కడెం’
ABN , First Publish Date - 2023-07-28T03:15:36+05:30 IST
నిర్మల్(Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టు(Kadem project)కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాజెక్టు కింది గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
గండి పడి కొట్టుకుపోయిన ప్రధాన కాలువ
18 గేట్లలో అతికష్టమ్మీద తెరుచుకున్న 16 గేట్లు..
మరమ్మతులు చేయకపోవడంపై జనం ఫైర్
అల్లోల, రేఖానాయక్ నిలదీత..
నేడు ప్రాజెక్టు సందర్శనకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ
నిర్మల్/హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): నిర్మల్(Nirmal) జిల్లాలోని కడెం ప్రాజెక్టు(Kadem project)కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాజెక్టు కింది గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాజెక్టు గేట్లపై నుంచి వరద నీరు దిగువకు ఉధృతంగా దుంకుతోంది. ప్రాజెక్టు కింద ఉన్న మైసమ్మ గుడి ప్రాంతంలో ప్రధాన కాలువకు గండిపడి కాలువ కొట్టుకుపోయింది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. 7.063 టీఎంసీల మేర సామర్థ్యం కలిగి ఉంది. ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉన్నాయి. ఇందులో గురువారం ఉదయం 14 గేట్లు మాత్రమే పనిచేయడంతో వాటిని తెరిచారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్(Khanapur MLA Rekhanaik), ఇతర అధికారులు ప్రాజెక్టు వద్ద పరిస్థితిని చూసేందుకు వచ్చారు. కడెం ప్రాజెక్టు ఓవర్ ఫ్లో అయ్యి.. గేట్లపై నుంచి నీరు బయటకు రావడంతో ఎమ్మెల్యేతో పాటు ఇతర అధికారులు అక్కడ్నుంచి పరుగులు తీశారు. ప్రాజెక్టులోకి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. వాస్తవానికి ప్రాజెక్టు కట్ట సామర్థ్యం 3.50 లక్షల క్యూసెక్కులు మాత్రమే.. కానీ ప్రస్తుతం ఆ పరిమితి దాటి వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు కింది 12 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికన గేట్ల మరమ్మతులు జరిపారు. అప్పటివరకు మొరాయించిన 2, 4, 6, 12 నెంబర్ల గేట్లలో 4, 6 నెంబర్ గల గేట్లను జేసీబీల సాయంతో అతి కష్టమ్మీద తెరిచారు. మిగతా 2, 12 గేట్లు మాత్రం తెరుచుకోలేదు. మొత్తం 18 గేట్లలో 16 గేట్ల నుంచి కిందకు నీరు విడుదలవుతోంది. సాయంత్రం తర్వాత ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో తగ్గడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మంత్రి అల్లోల నిలదీత..
కడెం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇలాంటి పరిస్థితే ఎదురైందని.. ప్రాజెక్టు గేట్ల మరమ్మతులపై అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు పరిస్థితి విషమిస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని స్థానికులు అడ్డుకొని నిలదీశారు. మంత్రి అల్లోలతో పాటే ఉన్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను కూడా ఘెరావ్ చేశారు. ‘‘గతేడాది జరిగిన సంఘటన మీకు గుర్తులేదా? ఇప్పటిదాక గేట్లు ఎందుకు మరమ్మతులు చేయించలేదు’’ అంటూ జనం నిలదీయడంతో మంత్రి, ఎమ్మెల్యేకు నోట మాట రాలేదు. కాగా, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికార యంత్రాగాన్ని మంత్రి అల్లోల ఆదేశించారు. నిర్మల్ సహా 4 జిల్లాల కలెక్టర్లతో వరద ముంపుపై సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే నిర్మల్ జిల్లాపై పూర్తిగా అవగాహన ఉన్న గత కలెక్టర్, ఎక్సైజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని వరదల ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం నియమించింది.
కడెంకు నిర్లక్ష్యపు గండం..
గోదావరి బేసిన్‌లో ఏటా వరదలతో నిండే ప్రాజెక్టుల్లో ఒకటైన కడెం ప్రాజెక్టుకు నిర్లక్ష్యపు గండం పట్టుకుంది. గతేడాదే భారీ వరదలతో ప్రాజెక్టు చిగురుటాకులా వణకగా... తాజా వరదతో మళ్లీ అదే పరిస్థితి. ప్రాజెక్టు గేట్లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. గతేడాది 6 లక్షల క్యూసెక్కుల వరద రాగా... ఈ దఫా 4 లక్షల క్యూసెక్కులు వచ్చింది. అయితే గతేడాది ప్రాజెక్టును డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ (డీఎ్‌సఆర్‌పీ) తనిఖీలు చేసి... అదనంగా 5 గేట్లతో స్పిల్ వే కట్టాల్సిందేనని నివేదిక ఇచ్చింది. దీనికి అనుగుణంగా అదనపు స్పిల్‌వే కోసం రూ.500 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనాలు వేసి.. ఐదు గేట్లతో స్పిల్‌వే కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. యుద్ధ ప్రాతిపదికన దీని నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా.. ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. తాజా వరదలతో ప్రాజెక్టులో ఇబ్బందులు తలెత్తడంతో యంత్రాంగం ఇప్పుడు నిద్రలేచింది. శుక్రవారం (28న) స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ప్రాజెక్టును సందర్శించనుంది.