Amit Shah: తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు

ABN , First Publish Date - 2023-03-17T16:25:14+05:30 IST

తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని, మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయం తెలియజేస్తోందని షా అన్నారు.

Amit Shah: తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు
Amit Shah Congratulates Mahbubnagar-Rangareddy-Hyd Teachers MLC AVN Reddy

న్యూఢిల్లీ: మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ (Mahbubnagar-Rangareddy-Hyd Teachers MLC) ఎన్నికల్లో బీజేపీ(BJP) మద్దతిచ్చిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి(AVN Reddy) విజయం సాధించడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) స్పందించారు. చారిత్రాత్మక విజయం సాధించారని ప్రశంసించారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని, మోడీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఈ విజయం తెలియజేస్తోందని షా అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay)ను, బీజేపీ కార్యకర్తలను కూడా అభినందించారు.

తెలంగాణలో ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో బీజేపీ-బీఆర్ఎస్(BJP Vs BRS) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అనేక అంశాల్లో రెండు పార్టీల మధ్య భీకర పోరు సాగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నేడో రేపో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెను ఈడీ ఢిల్లీ కార్యాలయానికి పిలిచి విచారించింది. మళ్లీ మరోసారి ఈ నెల 20న రావాలని నోటీసులిచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కూడా బీజేపీ-బీఆర్ఎస్ మధ్య యుద్ధమే జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఇంతలోనే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసు (TSPSC paper leak case) బయటకు వచ్చింది. ఈ కేసులో అధికార బీఆర్ఎస్‌ను ఎండగట్టేందుకు తెలంగాణ బీజేపీ పోరు ఉధృతం చేసింది.

బీజేపీ-బీఆర్ఎస్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం రెండు పార్టీలకు ప్రతిష్టగా మారింది. ఇంతలో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించడం కమలనాథులకు కొండంత బలాన్నిచ్చినటైందని రాజకీయ పరిశీలకులంటున్నారు.

Updated Date - 2023-03-17T16:34:48+05:30 IST