KTR: ఈసారి దుబ్బాక కోరుతున్నాం.. రఘునందన్ ఇంటికే..
ABN , First Publish Date - 2023-11-21T15:57:27+05:30 IST
ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో బీఆర్ఎస్ యువజన గర్జనలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
సిద్దిపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌లో బీఆర్ఎస్ యువజన గర్జనలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR), దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి (Dubbaka BRS Candidate Kotha Prabhakar Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఈ సారి దుబ్బాక కోరుతున్నాం.. రఘునందన్ ఇంటికే అంటూ వ్యాఖ్యలు చేశారు. రఘునందన్ రావు అనేక లుచ్చా మాటలు చెప్పారని.. ఇచ్చిన హామీలేవి అమలు చేయలేదని మండిపడ్డారు. ఆరోజు చెప్పిన లుచ్చా మాటలు మళ్ళీ చెబుతున్నారని అన్నారు. ఎన్నికల తరువాత అసైన్డ్ భూములకు పట్టాలు అందజేస్తామన్నారు. తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంటే సురక్షితంగా ఉంటుందో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్క సారి గుర్తు చేసుకోవాలన్నారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు, ఎరువుల కొరతలు ఉండేవన్నారు. కరెంట్ ఎక్కడ ఉందో చూపాలని రేవంత్, కోమటిరెడ్డి అంటున్నారని.. దుబ్బాకకు వచ్చి కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుంది కరెంట్ వస్తుందో, లేదో అంటూ మంత్రి సెటైర్ విసిరారు.
ఒక్క ఛాన్స్ అంటున్న కాంగ్రెసోళ్లకు సిగ్గు ఉండాలన్నారు. ఎద్దు తెలువదు, ఎవుసం తెలవని సన్నాసులు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అంటూ విరుచుకుపడ్డారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కొత్త సరుకు కాదని.. కొత్త సీసాలో పాత సరుకంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇక బీజేపీ నుంచి మీ దగ్గర ఓర్రుబోతు ఉన్నడు. మాటలు తప్ప చేతలు లేవు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ చీకటి రోజులే వస్తాయి. ఎన్నికల తరువాత 18 ఏళ్లు నిండిన తరువాత ఆడబిడ్డలకు సౌభాగ్య లక్ష్మీ అందజేస్తాం. అసర పెన్షన్ రూ.5 వేలకు పెంచుతాం.. రైతుబందు 16 వేలకు తీసుకెళ్తాం.. సిలిండర్ 400 కే ఇస్తాం. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్‌ను జనవరి నుంచి ఇస్తాం. అడడా చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి.. అన్ని పక్కన పెట్టి కారుకు ఓట్లు గుద్ధాలి. ఢిల్లీ నుంచి షేర్లు, బబ్బర్ షేర్లు బయలు దేరిండ్లు. అయినా కేసీఆర్ భయపడటం లేదు.. సింహం సింగిల్‌గానే వస్తుంది.. గుంపులుగా ఎవస్తాయో మీకు తెలుసు’’ అంటూ మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారు.