Share News

Ponguleti: దొర చేతిలో తెలంగాణ బందీ అయింది

ABN , First Publish Date - 2023-11-23T19:42:54+05:30 IST

సాధించుకున్న తెలంగాణ తొమ్మిదిన్నరేళ్లుగా ఓ దొర చేతిలో బందీ అయిందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) పేర్కొన్నారు.

Ponguleti: దొర చేతిలో తెలంగాణ బందీ అయింది

ఖమ్మం జిల్లా: సాధించుకున్న తెలంగాణ తొమ్మిదిన్నరేళ్లుగా ఓ దొర చేతిలో బందీ అయిందని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) పేర్కొన్నారు. గురువారం నాడు ఖమ్మంరూరల్ మండలం బారుగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ...‘‘తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, దొర చేతికి అప్పగించడానికి కాదు.. సామాన్య ప్రజానీకానికి మంచి చేయడానికే తెలంగాణ తెచ్చుకున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ దొర ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తాడు. ఎన్నికలు అయిపోతే సామాన్య ప్రజానీకం కష్టాలల్లో ఏనాడు పాలుపంచుకోడు. ఎన్నికలప్పుడు మాత్రమే ఇంద్రలోకం , చంద్రలోకం చూపించి ఈ దొర మాయ మాటలు చెబుతాడు. ఈ దొర మాయమాటలకు మోసపోతే మళ్లీ మనం గోసపడుతాం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి మోసపు కన్నీరు కారుస్తున్నారు

‘‘ఇందిరమ్మ రాజ్యంతో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజారాజ్యాన్ని తెచ్చుకుందాం. నిత్యం మీతోనే ఉంటా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటాను. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి మీ శీనన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇప్పటివరకు ప్రజల సొమ్ము దోచుకొని దాచుకున్నాడు. దోచుకొని దాచుకున్న సొమ్ముతో అక్కడ రేవంత్‌రెడ్డిని, ఇక్కడ నన్ను ఓడించడానికి కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ప్రజల కోసం బాధపడుతున్నట్లు మోసపు కన్నీరు కారుస్తున్నారు. ఒక వ్యక్తి కన్నీరు పెడుతున్నాడని ఆలోచిస్తే రాబోయే ఐదేళ్లు మనం ఆ కన్నీళ్లు భరించాల్సి వస్తుంది. మీరు ఉన్నారనే ధైర్యంతోనే కేసీఆర్‌ని ఎదిరిస్తున్నాను. రేపు అసెంబ్లీలో తప్పకుండా అధికారపక్షంలో నేను, ప్రతిపక్షంలో కేసీఆర్ ఉంటాడు. అసెంబ్లీలో ప్రతిరోజు చేసిన తప్పులను నిగ్గదీసే కార్యక్రమం ఉంటది’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-23T19:44:17+05:30 IST