RS Praveen Kumar: బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ చెప్పే బూటకపు మాటలను నమ్మి మోసపోవద్దు
ABN , First Publish Date - 2023-11-17T16:31:49+05:30 IST
బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పే బూటకపు మాటలను నమ్మి మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పే బూటకపు మాటలను నమ్మి మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బహుజన రాజ్యాధికార బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. బీఎస్పీ అభ్యర్థితో కలిసి ప్రవీణ్ కుమార్ బహిరంగ సభ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. సభలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘అలంపూరు గడ్డలో పుట్టినా..నడిగడ్డలో మొలికెత్తిన విత్తనాలు తిని ఈ స్థాయికి ఎదిగాను. ఆంధ్ర పాలకుల దోపిడి వల్ల నష్టపోయిన సిర్పూర్ కాగజ్‌నగర్ గడ్డమీద పోటీ చేస్తున్నాను. అలంపూరు, సిర్పూర్ రెండు నియోజకవర్గాలు బహుజన్ సమాజ్ పార్టీకి రెండు కళ్ల లాంటివి. 2009లో కొంతమంది దుర్మార్గుల వల్ల వెయ్యి ఓట్లతో ప్రస్తుత అభ్యర్థి ఆర్ఎస్ ప్రసన్నకుమార్ ఓడిపోయారు. తుమ్మిళ్ల దగ్గర కావలి కుక్కలా రైతులకు సాగునీరు ఇస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే మాట ఇచ్చారు.. గుంటనక్కల మారి ప్రజల జీవితాల్లో మన్ను పోశాడు. జూలకల్లు, మల్లమ్మ కుంట రిజర్వాయర్ల సంగతి అధ్వానంగా ఉన్న కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేళ్లుగా తెలంగాణ దోపిడికి గురైంది
ఆర్డీఎస్ పనులకు మరమ్మతులు లేవు.. చేసిన మరమ్మతుల్లో కూడా భారీ కుంభకోణం చేసిన ఘనత మీది. తెలంగాణ ప్రభుత్వం కుళ్లు కుతంత్రాలతో నిండి ఉంది. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం పదేళ్ల నుంచి రాజ్యమేలుతుంది. పదేళ్లుగా తెలంగాణ దోపిడికి గురైంది. వాళ్ల ఫామ్ హౌస్‌లో డబ్బులు దాచుకున్నారు. రైతులు పంట ఏ విధంగా మార్పిడి చేస్తారో.. ఈ రోజు కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ ఎన్నికల్లో మార్చాలి. కేసీఆర్, రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి హెలికాప్టర్‌లో తిరుగుతూ... భూములను ఎలా దండుకోవాలి.. ఫామ్ హౌస్‌లు ఎలా నిర్మించుకోవాలో అని భూములను పరిశీలిస్తున్నారు. మేము హెలికాప్టర్లో తిరుగుతుంటే.. ప్రభుత్వ భూములను, భూస్వాముల దగ్గర గల భూములను పేదలకు ఎలా పంచాలో చూసేందుకు హెలికాప్టర్ నుంచి సర్వే చేస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాదిగలకు నవంబర్ 11వ తేదీన క్షమాపణ చెప్తున్నానని అన్నారు. ఎన్నికల ముందు రిజర్వేషన్ ఇస్తా అంటున్నావు. పదేళ్లుగా మోదీ అధికారంలో ఉండి మాదిగలకు ఏం చేశారు’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.