Share News

Revanth Reddy: డీలర్ దయాకర్.. డాలర్ దాయకర్ అయ్యాడు.. పాలకుర్తి సభలో రేవంత్

ABN , First Publish Date - 2023-11-09T15:36:04+05:30 IST

పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉందని.. పోరాట పటిమ ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను చూస్తుంటే దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోందన్నారు.

Revanth Reddy: డీలర్ దయాకర్.. డాలర్ దాయకర్ అయ్యాడు.. పాలకుర్తి సభలో రేవంత్

జనగామ: పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉందని.. పోరాట పటిమ ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను చూస్తుంటే దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోందన్నారు. ఒకనాడు డీలర్‌గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు డాలర్ దయాకర్ రావు అయ్యారని వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakarrao) దందాలు చేస్తే... ఝాన్సీ రెడ్డి కుటుంబం పేదలకు సేవలు చేశారని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు కాలేజీలు, ఆసపత్రుల కోసం 80 ఎకరాల భూమి కొంటే దయాకర్ రావు లిటిగేషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. ఝాన్సీ రెడ్డికి పౌరసత్వం రాకుండా అడ్డుకున్నారన్నారు. దయాకర్ రావు నమ్మక ద్రోహి... మిత్ర ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు. శత్రువులతో చేతులు కలిపి, కుట్రలు చేసి తనను జైలుకు పంపారని.. కాంగ్రెస్ కార్యకర్తలపై దయాకర్ రావు పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో పాలకుర్తిలో ఈ దొరను... తెలంగాణలో ఆ దొరను ప్రజలు ఈ బొంద పెట్టడం ఖాయమని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.


కేసీఆర్‌కు సవాల్...

‘‘కేసీఆర్‌కు (CM KCR) సవాల్ విసురుతున్నా... 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. లేకపోతే వరంగల్ ఏకాశిలా పార్కు వద్ద ముక్కు నేలకు రాస్తావా? రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణను అమ్ముకుంటాడని కేసీఆర్ అంటుండు.. కేసీఆర్.. 2009లో నువ్వు సికింద్రాబాద్ ఎంపీ సీట్లు అమ్ముకున్నావ్. రాజ్యసభ సీట్లు కూడా అమ్ముకున్న దుర్మార్గుడివి నువ్వు. కోకాపేట భూములు అమ్ముకున్నది నువ్వు. నమ్మకం అంటే కాంగ్రెస్.. అమ్మకం అంటే బీఆర్‌ఎస్. మీ దగ్గర దోచుకున్న సొమ్ముతో ఎర్రబెల్లి అమెరికాలో పెట్టుబడులు పెడుతుండు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా పాలకుర్తిలో కాంగ్రెస్‌ను గెలిపించండి. ఈ ఎన్నికలు కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యులకు... నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో నిర్ణయించుకోండి’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-11-09T15:41:27+05:30 IST