Share News

TS Assembly Polls : బిగ్ స్క్రీన్లపై వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌.. ఓటర్ల కోసం తగ్గేదేలే అంటున్న పార్టీలు

ABN , First Publish Date - 2023-11-18T05:07:53+05:30 IST

ఓట్ల వేటలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదు! ఎన్నికల్లో పోటీ పడే నేతాశ్రీలు అనుసరించే రూల్‌ నంబర్‌ వన్‌ ఇది. ఈ క్రమంలోనే..

TS Assembly Polls : బిగ్ స్క్రీన్లపై వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌.. ఓటర్ల కోసం తగ్గేదేలే అంటున్న పార్టీలు

  • యువతను ఆకట్టుకునేందుకు

    పార్టీలు, నేతల యత్నం

  • ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఇండియా-ఆస్ట్రేలియా

  • ఫైనల్స్‌కు రావడంతో ఉత్కంఠ

  • రేపు ప్రత్యేక స్ర్కీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు!

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఓట్ల వేటలో ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదు! ఎన్నికల్లో పోటీ పడే నేతాశ్రీలు అనుసరించే రూల్‌ నంబర్‌ వన్‌ ఇది. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం యువతను ఊపేస్తున్న క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫీవర్‌ను (World Cup cricket match) సొమ్ము చేసుకోవడానికి అన్ని పార్టీల నాయకులూ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇండియా ఫైనల్స్‌కు చేరడం.. అందునా ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చే ఆస్ట్రేలియా కావడం, 2003లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియాతో లెక్క సరిచేయడానికి టీమిండియాకు 20 ఏళ్ల తర్వాత వచ్చిన అవకాశం కావడంతో.. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో..ఎన్నికల ప్రచారంలో ఉన్న నాయకులు ఈ మ్యాచ్‌పై దృష్టి సారించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్‌ మొదలు కానుంది. దీంతో నేతలు తమ తమ నియోజకవర్గాల పరిధిలో ఏయే ప్రాంతాల్లో క్రికెట్‌ అభిమానులు ఎక్కువగా ఉన్నారో ఆరా తీయడం ప్రారంభించారు.

ఆ వివరాల ఆధారంగా.. యూత్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పెద్ద పెద్ద ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటుచేసి, మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని వారు నిర్ణయించినట్టు సమాచారం. ఇలా తెరలు ఏర్పాటుచేసి మ్యాచ్‌ను లైవ్‌ ఇవ్వడం ద్వారా యువతలో తమ గురించి చర్చ జరుగుతుందని, అది తమకు లాభిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు మ్యాచ్‌ మధ్యలో ఓవర్‌ పూర్తయినపుడు సెకన్ల వ్యవధిలో పలు ప్రకటనలు వస్తుంటాయి. ఆ ప్రకటనల సమయంలో తమ పార్టీ గుర్తుకు ఓటేయాలంటూ అభ్యర్థించే ప్రకటనలను ప్రసారం చేస్తే ఎలా ఉంటుందని కూడా అభ్యర్థులు చర్చించుకుంటున్నారు. కాగా ఓటర్లను ఆకర్షించుకునేందుకు ఇప్పటికే అభ్యర్ధులు తమ నియోజకవర్గాల పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీలు, మేజర్‌ గ్రామపంచాయతీల్లో ఎన్నికల కోసం పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఆ కార్యాలయాల్లో వినోదం కోసం టీవీలు, డీజే సౌండ్‌ బాక్స్‌లు, కాలక్షేపానికి క్యారంబోర్డు వంటివాటిని ఏర్పాటుచేశారు.

Updated Date - 2023-11-18T12:12:29+05:30 IST