Massive Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య గమనిక.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపు అతి భారీ వర్షాలు
ABN , First Publish Date - 2023-09-03T15:21:45+05:30 IST
తెలుగు రాష్ట్రాలను (Telugu States) మరోసారి వానలు ముంచెత్తుతున్నాయి.! గ్యాప్ ఇచ్చి మరీ వర్షాలు (Rains) కుమ్మేస్తున్నాయి.! ఒక్కోసారి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా గంటల తరబడి కురుస్తున్న వర్షాలతో ప్రజలు భయాందోళనకు గురువుతున్న పరిస్థితి..
తెలుగు రాష్ట్రాలను (Telugu States) మరోసారి వానలు ముంచెత్తుతున్నాయి.! గ్యాప్ ఇచ్చి మరీ వర్షాలు (Rains) కుమ్మేస్తున్నాయి.! ఒక్కోసారి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా గంటల తరబడి కురుస్తున్న వర్షాలతో ప్రజలు భయాందోళనకు గురువుతున్న పరిస్థితి. ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం రోజున ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో రేపు అనగా.. సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో సోమవారం నాడు తెలంగాణలో (Telangana) భారీ నుంచి అతి భారీ వర్షాలు (Very Heavy Rains) కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఒక ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక (Karnataka) వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ శనివారం నాడే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసింది. అయితే.. మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కాగా.. శనివారం ఒక్కరోజే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 5.5 సెం.మీ., నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెళ్లి 5.4 సెం.మీ., నారాయణపేట జిల్లా ధన్వాడ 4.8 సెం.మీ., నిర్మల్ జిల్లా భైంస మండలం వనాల్‌పహాడ్‌లో 4.3 సెం.మీ. వర్షం కురిసిన విషయం తెలిసిందే. అయితే.. సోమ, మంగళవారాల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. అయితే.. సోమవారం నాడు మాత్రం తెలంగాణలో అత్యంత తీవ్రమైన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచనతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.
భాగ్యనగరంలో ఇలా..?
మరోవైపు.. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో (Hyderabad) వర్షం కురిసింది. ఇవాళ ఉదయం నుంచి కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ వాతావరణంలో మాత్రం మార్పులు బాగానే కనిపిస్తున్నాయి. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్, బోరబండ, అల్లాపూర్, యూసఫ్‌గూడ, సనత్‌నగర్, అమీర్‌పేట్, మైత్రీవనం, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మలక్‌పేట్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే.. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో భారీగానే వర్షం కురిసే అవకాశం మాత్రం ఉంది.
ఏపీలోనూ వర్షాలే..!
ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ (Andhrapradesh) రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు తప్ప ఎండలు ఎక్కడా కనిపించలేదు. ఏపీలోని పలు జిల్లాల్లో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో భారీగా ఉరుములు, మెరుపులు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సోమ, మంగళవారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా కూడా వచ్చే 5 రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ బులిటెన్‌లో పేర్కొంది.