Investment for Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. ముందుకొచ్చిన యూఏఈ దిగ్గజ సంస్థ
ABN , First Publish Date - 2023-09-05T15:03:43+05:30 IST
రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు మరో యూఏఈ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్ఫ్కో సుముఖత వ్యక్తం చేసింది.
హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు మరో యూఏఈ దిగ్గజ సంస్థ ముందుకొచ్చింది. రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్ఫ్కో (UAE company NAFFCO) సుముఖత వ్యక్తం చేసింది. ఈ సంస్థ రాష్ట్రంలో అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో (National Academy of Construction) కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు నాఫ్ఫ్కో సంస్థ ముందుకు వచ్చింది.
దుబాయిలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టబడితో మంత్రి కేటీఆర్ తన పర్యటనను ప్రారంభించారు. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్ఫ్కో(NAFFCO) కంపెనీ తెలంగాణలో రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతిబ్ (NAFFCO Khalid Al Khatib, CEO) ప్రతినిధి బృందం సమావేశమైంది. తెలంగాణ రాష్ట్రంలో తమ అగ్నిమాపక సామాగ్రిని తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో భాగంగా 700 కోట్లు రూపాయల భారీ పెట్టుబడిని పెడుతున్నట్లు తెలిపింది. తెలంగాణతో పాటు భారతదేశం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సామాగ్రి, అగ్నిమాపక సేవల అవసరం రానున్న భవిష్యత్తులో భారీగా పెరుగుతుందని విశ్వాసం తమకుందని నాఫ్ఫ్కో తెలిపింది. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న అగ్నిమాపక సామాగ్రి తయారీ ప్లాంట్ భారతదేశ డిమాండ్‌కు సరిపోతుందని నాఫ్ఫ్కో కంపెనీ సీఈవో విశ్వాసం వ్యక్తం చేశారు.
దీంతో పాటు తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్ ప్రతిపాదనకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఈ ట్రైనింగ్ అకాడమీ ద్వారా దాదాపు 100పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌కు సంస్థ సీఈవో తెలియజేశారు.