BJP Leader: ప్రజల ప్రాణాలు తీసేందుకేనా ఈ ఉత్సవాలు?.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై బండి సంజయ్

ABN , First Publish Date - 2023-06-20T16:02:51+05:30 IST

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆరవ తరగతి విద్యార్థి ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా అంటూ మండిపడ్డారు.

BJP Leader: ప్రజల ప్రాణాలు తీసేందుకేనా ఈ ఉత్సవాలు?.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై బండి సంజయ్

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో ఆరవ తరగతి విద్యార్థి ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) స్పందించారు. ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా అంటూ మండిపడ్డారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ స్పందిస్తూ... ‘‘తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్ దుర్మరణం దిగ్భ్రాంతికరం. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. స్కూల్‌లో చదువుకుంటున్న విద్యార్ధిని దశాబ్ది ఉత్సవాలకు తీసుకొచ్చిన ప్రభుత్వమే ఈ మృతికి బాధ్యత వహించాలి. తక్షణమే బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలి. ప్రజల ఉసురు పోసుకునేందుకే బీఆర్ఎస్ సర్కార్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందా? ఈ ఉత్సవాల్లో పాల్గొనేలా ప్రభుత్వ యంత్రాగంపై ఒత్తిడి తెస్తున్న ఈ సర్కార్.. విద్యార్థులను కూడా బలవంత పెట్టడం దారుణం. ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్న చిన్నారి విగతజీవిగా మారడానికి కారణమెవరు? ఆ తల్లిదండ్రుల బాధను ఎవరు తీరుస్తారు? ఏం చెప్పి వారిని ఓదారుస్తారు..?. గతంలో ఖమ్మం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని కొందరు మృతి చెందారు.. వనపర్తి జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కళ్యాణలక్ష్మీ చెక్కు తీసుకునేందుకు వచ్చిన మరో వృద్ధురాలిని రోజంతా నీరీక్షించేలా చేయించి ఆమె మృతికి కారణమయ్యారు.. ఇప్పుడు దశాబ్ధి ఉత్సవాల్లో 6వ తరగతి చిన్నారి దుర్మరణం పాలయ్యాడు.. ప్రజల ప్రాణాలు తీసేందుకే మీ సమ్మేళనాలు, ఉత్సవాలు, వేడుకలా..?’’ అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-06-20T16:02:51+05:30 IST