Jeedimetla: ఈ తల్లీకొడుకులు మామూలోళ్లు కాదు.. హైదరాబాద్‌లో ఉంటూ ఏం చేశారో చూడండి !

ABN , First Publish Date - 2023-03-10T14:36:36+05:30 IST

తల్లీకొడుకులు వాళ్లు ఇద్దరూ ఇద్దరే.. ఒకరిని మించిన వారు మరొకరు..వీరికి మరొకరు తోడయ్యాడు..

Jeedimetla: ఈ తల్లీకొడుకులు మామూలోళ్లు కాదు.. హైదరాబాద్‌లో ఉంటూ ఏం చేశారో చూడండి !

జీడిమెట్ల (ఆంధ్రజ్యోతి): తల్లీకొడుకులు వాళ్లు ఇద్దరూ ఇద్దరే.. ఒకరిని మించిన వారు మరొకరు..వీరికి మరొకరు తోడయ్యాడు.. కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గం వెదికారు. అద్దె కార్లను అమ్ముకోవడమే మార్గంగా ఎంచుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్(Private Travels) కార్లను అద్దెకు తీసుకుని నెలనెలా రెంట్ చెల్లిస్తూ మంచిగా నటించారు..చివరి రెంట్‌(Rent)కు తీసుకున్న అద్దె కార్లను విక్రయించి సొమ్ము చేసుకుంటూ, జల్సాలు చేస్తున్నారు.. చివరికి పోలీసులకు చిక్కారు. తల్లీకొడుకులతోపాటు మరో వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌(Vikarabad) జిల్లా రామాయగూడకు చెందిన మణిరాజ్‌(29) డిగ్రీ చదివాడు. గతంలో ట్రావెల్స్‌ వ్యాపారం చేశాడు. కరోనా సమయంలో అప్పుల్లో కూరుకుపోయాడు. తల్లి ప్రేమలతతో కలిసి నగరంలోని పలు ట్రావెల్స్‌ నుంచి కార్లను అద్దెకు తీసుకున్నారు. నెల రోజులపాటు అద్దె చెల్లించి అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందులలో శంకర్‌రెడ్డి అనే వ్యక్తికి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌ పరిధిలో 9 కార్లు, జగద్గిరిగుట్ట ప్రాంతంలో 8 కార్లు, జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక కారును దొంగిలించారు. షాపూర్‌నగర్‌కు చెందిన షాకీర్‌ జనవరిలో తన కారును మణిరాజ్‌ అద్దెకు తీసుకుని సమాధానం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ హరీష్‌ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. గురువారం రామంతాపూర్‌లో బైక్‌పై వెళ్తున్న మణిరాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కొడుకు దొంగ వ్యాపారానికి సహకరించిన తల్లి ప్రేమలత, కార్లను కొనుగోలు చేసిన పులివెందుల శంకర్‌రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-10T14:36:36+05:30 IST