Revanth reddy: మమ్మల్ని మరుగుజ్జులు అంటారా.. కేసీఆర్ ఏమన్నా బాహుబలినా?

ABN , First Publish Date - 2023-10-06T14:48:51+05:30 IST

తెలంగాణలో బిల్లా, రంగాలు తిరుగుతున్నారని విమర్శించారు. చిత్త కార్తె కుక్కల్లా తిరుగుతున్నారన్నారు. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును కాంగ్రెస్ మంత్రిని చేసిందని గుర్తుచేశారు. రబ్బరు చెప్పులు వేసుకునే హరీష్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు.

Revanth reddy: మమ్మల్ని మరుగుజ్జులు అంటారా.. కేసీఆర్ ఏమన్నా బాహుబలినా?

న్యూఢిల్లీ: తెలంగాణలో బిల్లా, రంగాలు తిరుగుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) విమర్శించారు. చిత్త కార్తె కుక్కల్లా తిరుగుతున్నారన్నారు. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావును (Minister Harish Rao) కాంగ్రెస్ మంత్రిని చేసిందని గుర్తుచేశారు. రబ్బరు చెప్పులు వేసుకునే హరీష్ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ అని చెప్పుకొచ్చారు. ‘‘మమ్మల్ని మరుగుజ్జులు అంటారా.. కేసీఆర్ (CM KCR) ఏమన్నా బాహుబలి నా.. అద్దంలో ముఖం చూసుకోవాలి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో అమలు చేస్తున్న పథకాలు తెలంగాణలో అంతటా ఎందుకు అమలు చెయ్యరని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోందని ధఈమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చామని.. అవి నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


తెలంగాణ సెంటిమెంట్ పేరుతో దోపిడీ చేశారని ఆరోపించారు. అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ నిర్మాణం వరకు చేసిన ఖర్చుకు, పిలిచిన టెండర్లకు పొంతన లేదన్నారు. రూ.400 కోట్లతో సెక్రటేరియట్ నిర్మాణం అని చెప్పి రూ.1200 కోట్లు ఖర్చు చేశారన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా సర్వేలు వస్తున్నాయని తెలిపారు. బిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు 36 సీట్లు వస్తాయని.. మిగతా సీట్లు అన్ని కాంగ్రెస్‌వి అని చెప్పుకొచ్చారు. సామాజిక వర్గాల నుంచి వస్తున్న అంశాలను పరిశీలించి టిక్కెట్లు ఇస్తామన్నారు. రాని వారికి ఇతర పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని టీపీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం కూటమి టార్గెట్ లోక్‌సభ గెలుపన్నారు. నాలుగు లోక్‌సభ స్థానాలు బీజేపీకి, ఒకటి ఎంఐఎం, మిగతావి బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కొత్తగా మేనిఫెస్టో పేరుతో ఏం తీసుకొస్తారని ప్రశ్నించారు. మేనిఫెస్టో పేరుతో కొత్త అబద్దాలను ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోందని రేవంత్ వ్యాఖ్యలు చేశారు.


కాగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆయన అనుచరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కసిరెడ్డి నారాయణరెడ్డికి ఖర్గే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Updated Date - 2023-10-06T14:48:51+05:30 IST