Revanth: దేశం గర్వించేలా పతకాలు తెచ్చిన రెజ్లర్లకు ఇదేనా రివార్డ్?.. రేవంత్ ఫైర్
ABN , First Publish Date - 2023-05-04T12:37:12+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్లతో ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్లతో ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘మహిళా సాధికారతపై బీజేపీ బూటకపు మాటలు చెబుతుండగా, ఒక ఒలింపిక్ పతక విజేత, ఇతర రెజ్లర్‌లపై ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వం నిరసనకారులపై తన బలాన్ని ప్రయోగిస్తోంది. కానీ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు!. పతకాలు తెచ్చి దేశం గర్వించేలా చేసినందుకు ఇదేనా రివార్డ్...?!’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
కాగా.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై (Wrestling Federation of India Chief Brij Bhushan Singh) ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తమపై ఢిల్లీ పోలీసులు దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారని మహిళా రెజ్లర్లు (Women wrestlers) ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న తమపై గత అర్ధరాత్రి ఢిల్లీ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో పాటు భారత అగ్రశ్రేణి రెజ్లర్లలో ఒకరైన వినేష్ ఫోగట్ ఆరోపించారు. ‘‘మమ్మల్ని చంపాలనుకుంటే చంపేయండి’’ వినేష్ ఫోగట్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘‘ఈ రోజు చూడ్డానికి మనం దేశం కోసం పతకాలు సాధించామా? మేం తిండి కూడా తినలేదు. మహిళలను దుర్భాషలాడే హక్కు ప్రతి పురుషుడికి ఉందా? ఈ పోలీసులు తుపాకులు పట్టుకున్నారు, వారు మమ్మల్ని చంపుతారు’’ అని వినేష్ ఫోగట్ అన్నారు.