TPCC Chief: పాలమూరులో ప్రధాని మోదీ సభపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-10-02T12:52:23+05:30 IST
పాలమూరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటినపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ పట్ల మోదీ వివక్షత చూపిస్తున్నారన్నారు. నరేంద్ర మోదీ కేవలం గుజరాత్ కి మాత్రమే ప్రధానమంత్రా?.. గత ప్రభుత్వాలు ప్రజలకి ఇచ్చిన హామీలు అపుతారా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: పాలమూరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పర్యటినపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ పట్ల మోదీ వివక్షత చూపిస్తున్నారన్నారు. నరేంద్ర మోదీ కేవలం గుజరాత్ కి మాత్రమే ప్రధానమంత్రా?.. గత ప్రభుత్వాలు ప్రజలకి ఇచ్చిన హామీలు అపుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై అక్కసు పెంచుకున్న మోదీని తెలంగాణకు తేవడం ప్రజలని అవమాన పరచడమే అని అన్నారు. మోదీ తరపున డీకే అరుణ, కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీ భజన మీరు చేసుకోవడానికే సభ పెట్టుకున్నారని విమర్శించారు. మోదీ వచ్చి వరాలు ఇస్తాడని అశించామని.. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై మోదీ ప్రకటన చేస్తారని అనుకున్నామన్నారు. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు కొత్త అంశాలు కాదని తెలిపారు. కుటుంబ పాలన గూర్చి మాట్లాడిన మోదీ కుటుంబ దోపిడీ గురించి మాట్లాడలేదన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని నిలదీశారు. కేసీఆర్ (CM KCR) అవినీతి చేస్తున్నాడని అంటారని... చర్యలు మాత్రం తీసుకోరని మండిపడ్డారు. కేసీఆర్ దోపిడీలో మోదీకి వాట ఉందన్నారు. డిపాజిట్లు రాని రాష్ట్రానికి మోదీ పదేపదే రావడం ఏంటని అడిగారు. మోదీ పర్యటనలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే అని చెప్పుకొచ్చారు.
కేటీఆర్, హరీష్‌రావుపై విమర్శలు...
కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) బిల్లా రంగాలుగా మారారని విమర్శించారు. బిల్లా రంగాలు లాజిక్‌లేని సన్నాసి మాటలు మాట్లాడితే ఎలా? అని అన్నారు. ఏం చేసినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మరని తెలిపారు. బూట్లు నాకినా, మోకాళ్ళతో నడిచినా హరీష్, కేటీఆర్‌ను ప్రజలు నమ్మరన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుందనే కనీస అవగాహన లేకుండా బిల్లా రంగాలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాటలు బ్రహ్మానందంలాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. బిల్లా రంగాలకు కాంగ్రెస్‌ను ప్రశ్నించే నైతికత లేదన్నారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఉంటుందన్నారు. పార్టీలో బహునాయకత్వం ఉందంటే తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టు కదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి మారాడా అని నిలదీశారు. సామాజిక న్యాయం తమ లక్ష్యం కాబట్టి అన్ని సామాజిక వర్గాల నాయకులకు ప్రాతినిధ్యం ఇస్తామన్నారు. అందరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది కాబట్టే కాంగ్రెస్‌లో బహునాయకత్వం కనిపిస్తుందన్నారు. అక్టోబర్ 10 లేదా 12 న షెడ్యూల్ వస్తుందని.. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉచిత కరెంట్, రైతు బుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, మైనార్టీ రిజర్వేషన్ల అనే 6 గ్యారెంటీ పథకాలను కాంగ్రెస్ గతంలో అమలు చేసిందని గుర్తుచేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ అమలు చేసిన పథకాలు వేరే రాష్ట్రంలో అమలు పరచలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.