Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేటుకు తాకట్టు పెట్టారు...
ABN , First Publish Date - 2023-04-29T15:55:58+05:30 IST
హైదరాబాద్: నాలుగేళ్ల నుంచి ఔటర్ రింగ్ రోడ్ (ORR) టోల్‌ను ఈగల్ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.
హైదరాబాద్: నాలుగేళ్ల నుంచి ఔటర్ రింగ్ రోడ్ (ORR) టోల్‌ను ఈగల్ ఇన్‌ఫ్రాకు కట్టబెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓఆర్ఆర్‌ను ఆదాయవనరుగా కేటీఆర్ (KTR) మిత్రబృందం ఉపయోగించుకుందని ఆరోపించారు. ఈ ఆదాయాన్ని శాశ్వతం చేసుకోవాలని కేటీఆర్ కుటుంబం (KCR Family) ఆలోచనగా ఉందని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్‌ను మంత్రి కేటీఆర్ ప్రైవేట్‌కు తాకట్టు పెట్టారని, తమ కుటుంబానికి లాభం ఉండదని 30 ఏళ్ల పాటు.. ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పెట్టుబడులు అంటే నూతన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని.. ఉన్నవాటిని తాకట్టు పెట్టడం కాదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని, హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్‌ను నిర్మించిందని రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ నిర్మించిందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారంటే... విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డే ప్రామాణికమని అన్నారు. వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్ రోడ్‌ను ప్రయివేటుకు అమ్మేశారని, పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి కానీ ఉన్నవాటిని తాకట్టు పెట్టడం కాదని రేవంత్ వ్యాఖ్యానించారు.
కనీసం రూ. 30 వేల కోట్లు ఆదాయం వచ్చే ఔటర్‌ను రూ. 7,380 కొట్లకే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని రేవంత్ విమర్శించారు. దీని వెనక సోమేశ్ కుమార్ వ్యవహారం నడపగా.. అరవింద్ కుమార్ సంతకం పెట్టారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొట్టమొదట వీటిపై విచారిస్తామన్నారు. దీనిపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ప్రజలు ఔటర్ రింగ్ రోడ్‌ను వినియోగించే పరిస్థితులు లేవని, టెండర్ విధానాలపై విచారణ సంస్థలన్నింటికి పిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.