TPCC Chief: కోదండరాంతో భేటీ తర్వాత రేవంత్ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-10-30T14:28:31+05:30 IST
గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీజేఎస్ చీఫ్ కోదండరాం పోరాడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం కోదండరాంతో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ఆయన మద్దతు కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్: గత పదేళ్లుగా బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీజేఎస్ చీఫ్ కోదండరాం (TJS Chief Kodandaram) పోరాడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) తెలిపారు. సోమవారం కోదండరాంతో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ఆయన మద్దతు కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళతామన్నారు. టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుందని తెలిపారు. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్‌కు కీలక స్థానం ఉంటుందన్నారు. లక్ష్యాన్ని ముద్దాడే వరకు అండగా ఉంటామని కోదండరాం హామీ ఇచ్చారని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు.
సీట్లు ఓట్లు కంటే.. ఒక గొప్ప లక్ష్యం కోసం కలిసి పనిచేస్తున్నామన్నారు. ఒక నియంతను గద్దె దించి ప్రజా పాలన తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ ప్రైవేటు సైన్యంపై అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్‌తో పాటు హ్యాకర్స్‌ను ఉపయోగించి తమ ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్‌ను నియంత్రించాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు ఎవరూ సాయం చేయకుండా కేటీఆర్ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాము ఫోన్లో ప్రైవేటుగా మాట్లాడుకున్న సంభాషణలను హ్యాక్ చేసి వింటున్నారని మండిపడ్డారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.