BJP vs MIM: ఎంఐఎం, బీజేపీ మధ్య మాటల యుద్ధం
ABN , First Publish Date - 2023-05-31T14:04:32+05:30 IST
హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఎంఐఎం (MIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi), బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా (Amit Shah) హైదరాబాద్‌లోనే ఉండి తెలంగాణపై ఫోకస్ పెడతారని అన్నారు. బీఆర్ఎస్ స్టీరింగ్ (BRS Steering) తమ చేతిలో ఉందని అమిత్ షా అంటారని.. అదే నిజమైతే పాతబస్తీలో అభివృద్ధి ఎందుకు జరగడంలేదని అసదుద్దీన్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు మాట్లాడితే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ (Surgical Strike) చేస్తామని బెదిరిస్తున్నారని దమ్ముంటే భారత భూభాగంలోకి వస్తున్న చైనా (China)పై సర్జికల్ స్ట్రైక్ చేయాలని అన్నారు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉంటే పాతబస్తీలో అభివృద్ధి ఎందుకు జరగడంలేదని, తాము అడిగిన దళిత బంధు సీఎం కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని బీజేపీ నేతలను అసదుద్దీన్ ప్రశ్నించారు. ముస్లింలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయన్నారు. ఎన్నికల సమయంలోనే అన్ని పార్టీలకు ముస్లింలు గుర్తుకువస్తారని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
అసదుద్దీన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్..
ముస్లింల జీవితాల్ని ఎంఐఎం నాశనం చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తేవాలని ఎంఐఎం చూస్తోందన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మోచేతి నీళ్లు తాగడం ఎంఐఎంకు అలవాటేనని బీఆర్ఎస్‌ను మరోసారి అధికారంలోకి తేవాలన్నదే ఎంఐఎం ప్రయత్నమని అన్నారు. ముస్లిం సమాజం ఎంఐఎంను చీదరించుకుంటోందని అన్నారు. అసదుద్దీన్‌కు దమ్ముంటే తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చెయాలని సవాల్ విసిరారు. అసదుద్దీన్ తమ ఆస్తులు, వ్యాపారాలు రక్షించుకోవడమే తప్ప.. ముస్లింల కోసం ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. పార్టీలో చర్చించి పాదయాత్రపై నిర్ణయం తీసుకుంటామని, బస్సు యాత్రనా.. లేక పాదయాత్రనా చర్చిస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.