DK Aruna: కాంగ్రెస్ ఓట్ల కోసం గ్యారెంటీలు ప్రకటించింది

ABN , First Publish Date - 2023-09-29T15:37:59+05:30 IST

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మోసం చేస్తోందని.. ఓట్ల కోసం మాత్రమే ఆ పార్టీ గ్యారెంటీలు ప్రకటించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) వ్యాఖ్యానించారు.

DK Aruna: కాంగ్రెస్ ఓట్ల కోసం గ్యారెంటీలు ప్రకటించింది

నారాయణపేట: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అంటూ ప్రజలను మోసం చేస్తోందని.. ఓట్ల కోసం మాత్రమే ఆ పార్టీ గ్యారెంటీలు ప్రకటించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) వ్యాఖ్యానించారు. అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభ నేపథ్యంలో శుక్రవారం నాడు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీకే అరుణ హాజరయ్యారు. ఈసందర్భంగా అరుణ మీడియాతో మాట్లాడుతూ...‘‘అక్టోబర్ ఒకటిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌లో కాచిగూడ నుంచి కృష్ణ వరకు నూతన రైలును ప్రారంభిస్తారు. హె‌చ్‌పీ(HP) గ్యాస్ పైపులైన్ ప్రారంభిస్తారు. జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. జిల్లాలో మొత్తం 13 వేల 5 వందల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసింది.

రాబోయే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే మక్తల్ నారాయణపేటకు జూరాల నుంచి సాగునీరు అందిస్తాం. కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తోంది. వికారాబాద్ కృష్ణ వరకు రైలు మార్గం పొడిగిస్తాం. నారాయణపేట యాదగిరి హైవే రోడ్డు మంజూరుకు కృషి చేస్తాం. పాలమూరు రంగారెడ్డి పథకంలో కేవలం ఒక మోటారు మాత్రమే ప్రారంభించి మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెపుతోంది. పాలమూరు రంగరెడ్డి ఎత్తిపోతల పథకంలో డిజైన్‌లు మార్చి ఖర్చులు పెంచి సీఎం కేసీఆర్ కమీషన్లు తీసుకున్నారు. మోదీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలి’’ అని డీకే అరుణ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-29T15:37:59+05:30 IST