Share News

Srinivas Goud: రాహుల్ మీకున్న అర్హతేంటి?.. మీరు లీడరా.. రీడరా?

ABN , First Publish Date - 2023-11-01T14:08:04+05:30 IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Goud: రాహుల్ మీకున్న అర్హతేంటి?.. మీరు లీడరా.. రీడరా?

మహబూబ్‌నగర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Congress Leader Rahul Gandhi) మంత్రి శ్రీనివాస్‌గౌడ్(Minister Srinivas Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడతూ.. ‘‘రాహుల్ గాంధీ కుటుంబ పరిపాలన అంటారు.. మీకున్న అర్హత ఏంటి?.. మీరు లీడరా.. రీడరా? తెలంగాణ చరిత్ర తెలుసా? ఉద్యమంలో చనిపోయిన వారు కాంగ్రెస్ వల్లనే కదా’’ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటే అని అంటున్నారని... గతంలో ఎన్నికలు ఉన్నప్పుడు... తమరు అక్కడికి వెళ్లకుండా.. జోడో యాత్ర చేశారన్నారు. ‘‘మరి మీరా తొత్తులు.. మేమా’’ అని ప్రశ్నించారు. పదకొండు సార్లు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే సాగు, తాగు నీరు ఇవ్వకుండా పోటిరెడ్డిపాడుకు బొక్కకొట్టి ఆర్డీఎస్ బద్దలు కొట్టి నీళ్ళు దోచుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదేళ్లలో దేశంలోనే అత్యధిక జీడీపీ తెలంగాణది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ మహారాష్ట్రలో విస్తరిస్తుంటే.. కాంగ్రెస్ బుగులు పుట్టుకుని.. తమపై మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అవసరాల గురించి బీసీలను, మైనారిటీలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని వ్యాఖ్యలు చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యే అయిన ఎర్ర శేఖర్‌కు టిక్కెట్ జడ్చర్లలో ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడంతోనే బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమను జనం తెలుసుకున్నారని మంత్రి అన్నారు.


‘‘మీరెన్ని రోడ్ షోలు చేసినా.. డ్రామాలు చేసినా జనం నమ్మరు.. కేసీఆర్‌, కేటీఆర్‌లను తిట్టి పెద్ద నాయకుల అవుతారనుకుంటున్నారా.. మీరు ఎన్ని గెలుస్తారు.. ఎన్నింట్లో డిపాజిట్ వస్తదో చూద్దాం.. మా పార్టీలో చెల్లని వాళ్లకు టిక్కెట్లు ఇచ్చారు. మా నాయకుడు గల్లీలో ఉంటాడు.. మీ నాయకుడు ఢిల్లీలో ఉంటాడు. మీ పార్టీలో డజను మంది సీఎంలు ఉంటారు. పగటి కలలు కంటున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు బొంద పెడతారు. మీ మోసాల నుంచి బయటపడి.. ఎంతోమంది నాయకుల మా పార్టీలోకి వస్తున్నారు. రాహూల్ గాంధీ పొర్లు దండాలు పెట్టినా.. పదిసార్లు పర్యటించినా.. మీ పార్టీ అధికారంలోకి రాదు’’ అంటూ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ వ్యాఖ్యలు చేశారు.


వాళ్లు రాష్ట్రాన్నే అమ్మేస్తారు: ఎర్రశేఖర్‌

బడుగు బలహీనర్గాలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ అన్నారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్రల్లో కాంగ్రెస్ చేసిన మోసానికి గుణపాఠం చెప్పాలని బీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు ఇప్పుడు టిక్కెట్‌లు అమ్ముకున్నారని.. భవిష్యత్‌లో రాష్ట్రాన్ని అమ్మేస్తారన్నారు. పాలమూరు జిల్లాలో ముదిరాజ్‌లు అందరూ బీఆర్‌ఎస్‌కు అండగా ఉండాలని ఎర్రశేఖర్ కోరారు.

Updated Date - 2023-11-01T14:08:04+05:30 IST