Rains: వర్షాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న మహబూబ్‌నగర్ జిల్లాలో షాకింగ్ ఘటన.. గ్రామసమీపంలో మొసళ్ల గుంపు
ABN , First Publish Date - 2023-07-26T17:55:09+05:30 IST
భారీ వర్షాల కారణంగా విషసర్పాలు, హానికర ప్రాణులు ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో పలు చోట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో నదులు, చెరువులు, కాలువలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెరువులు, ఊళ్లు ఏకమైపోయాయి. అంతలా వరుణుడు రాష్ట్రంపై ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే నదులు, చెరువులు పొంగి ప్రవహిస్తుంటే.. ఈ ప్రభావం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. భారీ వర్షాల కారణంగా విషసర్పాలు, హానికర ప్రాణులు ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో పలు చోట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
మామూలుగా మొసళ్లను చూస్తూనే హడలెత్తిపోతాం. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో మొసళ్లు ఓ గ్రామ సమీపాన తిష్టవేశాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా (Mahbubnagar district) మక్తల్ మండలం పసుపుల గ్రామానికి సమీపంలో ఈ మొసళ్లు (Crocodiles) కనిపించాయి. ఈ గ్రామం కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని ఆనుకుని ఉంటుంది. దీంతో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరదల్లో అవి గ్రామం సమీపంలోని వాగులోకి కొట్టుకొచ్చాయని భావిస్తున్నారు. మొసళ్ల గుంపును చూసిన గ్రామస్తులు దడతో వణికిపోయారు. అనంతరం గ్రామస్తులంతా ఏకమై మొసళ్ల గుంపును బెదరకొట్టి నదిలోకి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను గ్రామస్తులు తమ మొబైళ్లతో షూటు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలు కాస్తా వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మొసళ్లతో జాగ్రత్త అంటూ గ్రామస్తులకు నెటిజన్లు సూచిస్తున్నారు. ఏదేమైనా ఇటువంటి సమయాల్లో నదీ ప్రాంతాలకూ.. చెరువుల దగ్గరకు వెళ్లకపోవడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు.