Harish Rao: రజనీకాంత్‌కు అర్ధమైనంతగా.. ఇక్కడి గజినీలకు అర్ధం కావట్లేదు..
ABN , First Publish Date - 2023-04-29T16:28:34+05:30 IST
హైదరాబాద్‌లో ఉన్నానా లేక.. న్యూయార్క్‌లో ఉన్నానా అనేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
సంగారెడ్డి: హైదరాబాద్‌లో ఉన్నానా లేక.. న్యూయార్క్‌లో ఉన్నానా అనేలా హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Tamila Super Star Rajinikanth) అన్నారని మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) తెలిపారు. అయితే ఇక్కడి అభివృద్ధి పక్క రాష్ట్రాల్లో ఉన్న రజనీకాంత్‌కు అర్ధమవుతుంది కానీ.. ఇక్కడ ఉన్న గజినీలకు అర్ధం కావట్లేదని విరుచుకుపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది (మం) కాశీపూర్‌లో పర్యటించిన మంత్రి కాశీపూర్‌లో బసవ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ... ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్‌ను (CM KCR) దించేస్తామని అంటున్నాయని.. అసలు కేసీఆర్‌ను ఎందుకు దించాలని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్‌ను ఎందుకు దించుతారని నిలదీశారు. ‘‘రైతుకు నగలు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్.. అందుకు కేసీఆర్‌ను గద్దె దించుతారా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్లు ఇచ్చినందుకు కేసీఆర్‌ను దించేస్తారా’’ అంటూ నిలదీశారు. లింగాయత్‌లను ఓబీసీల చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపామని తెలిపారు. ఓబీసీలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవట్లేదని విమర్శించారు. లింగాయత్‌లను ఓబీసీలో చేర్చేందుకు కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే లింగాయత్‌లను ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా బసవేశ్వరుడి చరిత్ర పెట్టిన ఘనత కేసీఆర్‌ది అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
ఇంతకీ రజనీకాంత్ ఏమన్నారు..!?
కాగా.. శుక్రవారం నాడు విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొన్న రజనీకాంత్ హైదరాబాద్ ప్రస్తావన తెచ్చారు. ‘ఇటీవల చాలాకాలం తర్వాత హైదరాబాద్‌ను సందర్శించాను.. నేను హైదరాబాద్‌లో ఉన్నానా..? లేక న్యూయార్క్‌లో ఉన్నానా..? అని అనిపించింది. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు. ఆయన ఘనత దేశ విదేశీ నాయకులకు కూడా తెలుసు. హైదరాబాద్ (Hyderabad)ను హైటెక్ నగరంగా చంద్రబాబు మార్చారు’ అని రజనీకాంత్ కొనియాడారు.