Minister KTR: చేనేత రుణమాఫీపై మంత్రి కేటీఆర్ తీపికబురు?
ABN , First Publish Date - 2023-08-12T14:25:39+05:30 IST
చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ మంచి తీపికబురును అందించారు.
యాదాద్రి: చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ (Minister KTR) మంచి తీపికబురును అందించారు. చేనేత రుణమాఫీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో (CM KCR) చర్చించి రుణమాఫీ అమలుకు ప్రయత్నిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. శనివారం భూదాన్ పోచంపల్లిలో చేనేత సమావేశంలో మంత్రి పాల్గొని ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ.. దుబ్బాకలో నేత కార్మికుడి ఇంట్లో కేసీఆర్ ఉన్నారు కాబట్టే చేనేతల పరిస్థితులు తెలుసన్నారు. కనుముక్కులలో మూతపడిన హ్యాండ్లూమ్ పార్కును రూ.12 కోట్లతో పున: ప్రారంభిస్తున్నామన్నారు. చేనేత భీమాను 57 ఏళ్ల నుండి 75 ఎండ్లకు పెంచినట్లు చెప్పారు. చేనేతకు చేయూత అనే కార్యక్రమంతో చేనేత కార్మికుల అకౌంట్‌లో నేరుగా డబ్బులు జమచేస్తున్నామన్నారు. మగ్గాలను ఆధునికరించడానికి రూ.40 కోట్ల ఫండ్‌ను ఇస్తున్నామన్నారు. చేనేత హెల్త్ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుడు చనిపోతే అంత్యక్రియలకు రూ.5 వేల నుంచి రూ. 25 వేలకు పెంచామన్నారు. చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ వేసి 75 ఏళ్ళలో ఏ ప్రధాని చేయని తప్పు నరేంద్ర మోడీ చేశారని మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. కోకాపేటలో 2 ఎకరాల స్థలంలో చేనేత భవనాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.