CPI: పొత్తు నిర్ణయం ఇక కేంద్ర నాయకత్వానిదే!

ABN , First Publish Date - 2023-09-06T04:34:31+05:30 IST

బీఆర్‌ఎ్‌సతో పొత్తును ఆశించి భంగపడిన సీపీఐ.. ఇప్పుడిక పొత్తుల నిర్ణయాన్ని తమ కేంద్రనాయకత్వానికే వదిలివేయాలని నిర్ణయించింది.

CPI: పొత్తు నిర్ణయం ఇక కేంద్ర నాయకత్వానిదే!

రాష్ట్ర సీపీఐ నిర్ణయం

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు

17న భారీ సభ, హాజరుకానున్న డి.రాజా

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌తో (BRS) పొత్తును ఆశించి భంగపడిన సీపీఐ (CPI).. ఇప్పుడిక పొత్తుల నిర్ణయాన్ని తమ కేంద్రనాయకత్వానికే వదిలివేయాలని నిర్ణయించింది. లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహగానాల నేపథ్యంలో పొత్తుల విషయంలో తొందరపడకూడదని సీపీఐ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌తో పొత్తుకు సంబంధించి ఇటీవల జరిగిన అనధికారిక చర్చలు, భవిష్యత్‌ కార్యాచరణపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం ముఖ్ధూంభవన్‌లో సమావేశమైంది. పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే నారాయణ కేంద్ర నాయకత్వం తరఫున ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తు గురించి చర్చించారు.


పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అనంతరం లోక్‌సభ రద్దయ్యే అవకాశం ఉందని, అదే జరిగితే లోక్‌సభతోపాటే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగవచ్చని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో కేంద్ర నాయకత్వం స్థాయిలోనే చర్చలు జరగాల్సి ఉంటుందని భావించారు. పొత్తులో భాగంగా అసెంబ్లీ సీట్లతో పాటు లోక్‌సభ సీట్లను కూడా కాంగ్రె్‌సను అడగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను 11 నుంచి 17వ తేదీ దాకా నిర్వహించాలని సీపీఐ నిర్ణయించింది. వారోత్సవాల చివరి రోజైన 17న నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా హాజరు కానున్నారు.

Updated Date - 2023-09-06T10:59:10+05:30 IST