విశాఖ పోర్టులో 483 టన్నుల బియ్యం స్వాధీనం
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:45 AM
విశాఖ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 483 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్ సోమవారం సాయం త్రం.....
కాకినాడలో నిఘా పెరగడంతో విశాఖకు అక్రమార్కులు
2 నెలల్లో 70 వేల టన్నులు ఎగుమతి: మంత్రి నాదెండ్ల
విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన 483 టన్నుల రేషన్ నిల్వలు
మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు
విశాఖపట్నం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): విశాఖ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసిన 483 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్ సోమవారం సాయం త్రం ఆకస్మికంగా పోర్టు పరిధిలో ఉన్న కంటైనర్ ఫ్రైట్ స్టేషన్‌కు చెందిన నాలుగు గోదాములను తనిఖీ చేశారు. ఒకటి, మూడు నంబరు గోదాముల్లో 190 టన్నులు బియ్యం ఉండగా, గోదాముల నుంచి పోర్టు ద్వారా ఎగుమతి చేసేందుకు 10 కంటైనర్లల్లో మరో 293 టన్నుల బియ్యం సిద్ధం చేసినట్టు గుర్తించారు. మంత్రి వెంట ఉన్న పౌరసరఫరాల సంస్థ అధికారులు బస్తాల నుంచి బియ్యం తీసుకుని పరిశీలించారు. రెండు గోదాములు, కంటైనర్లలో ఉన్న బియ్యంలో కెర్నల్స్ ఉన్నట్టు సాంకేతిక సిబ్బంది గుర్తించారు. రేషన్ కార్డుదారులకు సరఫరా చేసే ఫోర్టిఫైడ్ రైస్‌లో కెర్నల్స్ ఉంటాయి. తనిఖీలలో లభ్యమైనవి రేషన్ బియ్యంగా నిర్ధారించి 483 టన్నులు సీజ్ చేశారు. ఈ బియ్యంలో శాంపిల్స్ తీసుకుని పౌర సరఫరాల సంస్థకు చెందిన ల్యాబ్‌కు పంపారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎగుమతి అవుతున్నట్టు పక్కా సమాచారం రావడంతో నాలుగు బృందాలు తనిఖీ చేశాయన్నారు. రెగ్యులర్ బియ్యం, ఇతర సరుకులతో పాటు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ గోదాముల్లో రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించామన్నారు. ప్రస్తుతానికి తనిఖీల్లో దొరికిన 483 టన్నుల బియ్యం సీజ్ చేశామన్నారు. రాయ్‌పూర్‌కు చెందిన ఏజీఎస్ ఫుడ్స్ అనే సంస్థ ఈ బియ్యం ఎగుమతి చేస్తోందని వెల్లడించారు.
25 వేలకోట్ల బియ్యం ఎగుమతి
కాకినాడ పోర్టుపై నిఘా పెరగడంతో అక్రమ వ్యాపారులు 2నెలల నుంచి విశాఖ పోర్టు నుంచి 70వేల టన్నుల బియ్యం ఎగుమతి చేశారని మంత్రి నాదెండ్ల తెలిపారు. వాటి విలువ సుమారు రూ.25 వేల కోట్లు ఉంటుందన్నారు. బియ్యం స్మగ్లింగ్‌కు విశాఖ గేట్‌వేగా మారిందన్న ఆరోపణలు నిజమేనని తేలిందన్నారు. ప్రభుత్వం కిలో బియ్యం రూ.43కు కొనుగోలు చేసి కార్డుదారులకు అందజేస్తుందని, అయితే వారిని మోసం చేసి కిలో రూ.10కు తీసుకుంటున్నారన్నారు. తరువాత వీటిని పాలిష్ చేసి కిలో రూ.70 నుంచి రూ.80కు విదేశాలకు ఎగుమతి చేసి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. విశాఖలో సీజ్ చేసిన బియ్యం అక్రమ రవాణా విషయాన్ని సిట్‌కు నివేదించనున్నట్టు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో రేషన్ బియ్యం నిల్వలపై తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం, మీడియాతో కలిసి పనిచేస్తామన్నారు.