Share News

Amaravati : అవయవదాతల పార్థివ దేహాలకుప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ABN , Publish Date - Aug 09 , 2024 | 06:02 AM

అవయవ దానంతో పలువురికి జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాలకు గౌరవప్రదమైన వీడ్కోలు తెలిపాలని, వారి అంతియ యాత్రను రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Amaravati : అవయవదాతల పార్థివ దేహాలకుప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

  • ఆ కుటుంబానికి 10 వేలు ఆర్థిక సాయం

  • అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్‌ నేరుగా పాల్గొనాలి

  • ఉత్తర్వులు జారీ చేసిన స్పెషల్‌ సీఎస్‌ కృష్ణబాబు

అమరావతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): అవయవ దానంతో పలువురికి జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాలకు గౌరవప్రదమైన వీడ్కోలు తెలిపాలని, వారి అంతియ యాత్రను రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులకు గురువారం ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు జారీ చేశారు.

అవయవదానం చేసిన వారి కుటుంబాలకు రూ.10 వేల సహాయం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అవయవదానం దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ, అవయవ దాతల భౌతికకాయాలకు అంతిమ సంస్కారాన్ని గౌరవప్రదంగా నిర్వహించేలా సీఎంతో మాట్లాడి ఉత్తర్వులు వెలువడేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

మంత్రి చొరవతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. అవయవదాతల కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తూ వారిని శాలువా, ప్రశంసాపత్రం, పుష్పగుచ్ఛాలతో సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించే అంతిమ సంస్కారాలకు జిల్లా కలెక్టర్‌ లేదా జిల్లాస్థాయి సీనియర్‌ అధికారికి వెళ్లాల్సి ఉంటుంది.

అవయవ సేకరణ అనంతరం ఆస్పత్రి నుంచి దాత నివాసం లేదా శ్మశాన వాటికకు భౌతికకాయాన్ని ఉచితంగా తరలించే ఏర్పాటు చేయాలి.

జీవదాత భౌతిక దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ముందు ప్రభుత్వం తరఫున కార్యక్రమానికి హాజరైన ఉన్నతాధికారి, స్థానిక ప్రజాప్రతినిధి వారికి గౌరవ వందనంతో అంతిమ వీడ్కోలు పలకాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనంతరం దాతకు సంబంధించిన ఫొటోతో జిల్లా కలెక్టర్‌ పత్రికా ప్రకటన జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.


  • తెలంగాణ ప్రభుత్వమూ స్పందించాలి

అవయవదానం చేసినవారి అంత్యక్రియలు ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని అఖిల భారత శరీర అవయవదాతల సంఘం అధ్యక్షురాలు గూడూరు సీతామహాలక్ష్మీ కొనియాడారు. తెలంగాణలో కూడా ఆరోగ్యశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం సత్వరమే స్పందించి అమలు చేయ డం ముదావహమని, తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టిసారించి జీవోను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 09 , 2024 | 06:02 AM