Annamayya: కుమార్తెపై అత్యాచారయత్నం.. కువైట్ నుంచి వచ్చిన తండ్రి ఏం చేశాడంటే..
ABN , Publish Date - Dec 12 , 2024 | 03:19 PM
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామంలో గత శనివారం తెల్లవారుజామున నిద్రస్తున్న ఓ వికలాంగుడైన వృద్ధుడు(59) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి నిద్రస్తున్న ఆ వృద్ధుడి తలపై ఇనుప రాడ్డుతో బలంగా మోది హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అన్నమయ్య: కన్న కూతురిపై చేయి వేసిన వ్యక్తిని తండ్రి హత్య చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. కుమార్తెపై అత్యాచారయత్నం జరిగినా పోలీసులు సరిగా స్పందించలేదని, అందుకే నిందితుడిని తానే హత్య చేశానంటూ బాలిక తండ్రి విడుదల చేసిన వీడియో తాజాగా సంచలనం సృష్టిస్తోంది. తమకు సరైన న్యాయం జరగకపోవడంతోనే హత్య చేసినట్లు నిందితుడు వీడియోలో పేర్కొన్నాడు. న్యాయం జరగకపోతే సామాన్యుడు రియాక్షన్ ఇలానే ఉంటుందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చేసింది తప్పని తెలుసని కానీ, తండ్రిగా చేసింది మాత్రం ఒప్పేనంటూ అతను వీడియో రిలీజ్ చేశాడు.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామంలో గత శనివారం తెల్లవారుజామున నిద్రస్తున్న ఓ వికలాంగుడైన వృద్ధుడు(59) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తి నిద్రస్తున్న ఆ వృద్ధుడి తలపై ఇనుప రాడ్డుతో బలంగా మోది హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తాజాగా మృతుడి బంధువు కువైట్ నుంచి విడుదల చేసిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. హత్య చేసింది తానేనని, అందుకు బలమైన కారణం ఉందని వీడియోలో వెల్లడించారు. తన కుమార్తె విషయంలో అనుచితంగా ప్రవర్తించాడని, అందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పుకొచ్చాడు. వృద్ధుడిని చంపినందుకు తాను ఏమాత్రం పశ్చాతాపం పడడం లేదని బాలిక తండ్రి చెప్పాడు.
అసలేం జరిగిందంటే..
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటకు చెందిన దంపతులు బతుకుదెరువు నిమిత్తం కువైట్‌కు వెళ్లారు. అయితే వెళ్తూవెళ్తూ వారి ఒక్కగానొక్క కుమార్తె(11)ను భార్య చెల్లి వద్ద ఉంచాడు ఆ తండ్రి. బాలికను కువైట్‌కు తీసుకెళ్తే చదువు పాడవుతుందని, దంపతులిద్దరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత అతనికి మరదలి నుంచి ఫోన్ వచ్చింది. గొడవలు జరుగుతున్నాయని, కుమార్తెను తీసుకెళ్లిపోవాలంటూ ఆమె చెప్పింది. దీంతో భార్యను పంపించి కుమార్తెను కువైట్‌కు తీసుకువచ్చాడు ఆ తండ్రి. అయితే అసలేం జరిగిందని ఇద్దరూ కలిసి కుమార్తెను అడిగారు. దీనికి చిన్నారి భయపడుతూ అసలు విషయం చెప్పింది.
పిన్ని వాళ్ల మామ(వరసకు తాతయ్య) తనపై అత్యాచారయత్నం చేశాడని బాలిక సంచలన విషయం వెల్లడించింది. తాను నిద్రస్తున్న సమయంలో తన దుస్తులు మెుత్తం తీసేసి, నోరు నొక్కి బలాత్కారం చేయబోయాడని కన్నీటి పర్యంతమైంది. భయంతో కాసేపు అలాగే ఉండిపోయానని, ఆ తర్వాత గట్టిగా అరవడంతో పిన్ని వచ్చి కాపాడిందని చెప్పుకొచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన బాలిక తండ్రి మరదలికి ఫోన్ చేసి విషయం అడిగాడు. ఆమె సరిగా స్పందించకపోవడంతో ఓబులవారిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేయాలని కుమార్తె, భార్యను కువైట్ నుంచి భారత్‌కు పంపించాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా, కేవలం వారిని పిలిచి మందలించి వదలేశారని భార్య విషయాన్ని భర్తకు చెప్పింది. మరోవైపు పోలీసులకు లంచం ఇచ్చామని, కేసు నుంచి బయటపడ్డామని, కుమార్తె పరువు పోయేలా విషయాన్ని ప్రచారం చేస్తున్నారని మళ్లీ ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై మరోసారి నిందితుడి కుటుంబాన్ని స్టేషన్‌కు పిలిచి పోలీసులు మందలించి వదిలేశారు. దీంతో న్యాయం జరగలేదని ఆ తండ్రి ఓ దారుణ నిర్ణయానికి వచ్చాడు.
ఈ నేపథ్యంలోనే శనివారం కువైట్ నుంచి వచ్చిన బాలిక తండ్రి నిద్రిస్తున్న వృద్ధుడిపై ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. అతన్ని హత్య చేసి అనంతరం అక్కడ్నుంచి ఎవ్వరికీ తెలియకుండా తిరిగి కువైట్ వెళ్లిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అతన్ని తానే చంపేశానంటూ బాలిక తండ్రి తాజాగా వీడియో రిలీజ్ చేశాడు. తనకు చట్టంపై గౌరవం ఉందని, త్వరలోనే లొంగిపోతానంటూ చెప్పుకొచ్చాడు. హత్య చేయడానికి దారి తీసిన అన్ని విషయాలనూ వీడియోలో వివరించాడు. కాగా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ వీడియో తీవ్ర సంచలనంగా మారింది.