Police : కాసుల వేట..!
ABN , Publish Date - Sep 27 , 2024 | 11:49 PM
ఆ స్టేషన సిబ్బందిలో కొందరు విధి నిర్వహణ కంటే కాసుల వేటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్యూటీ దిగేలోగా జేబులు నింపుకుంటున్నారు. ప్రతి రోజు టార్గెట్ పెట్టుకుని మరీ దందాలకు దిగుతున్నారు. ఒక్కొక్కరు ఒక్క ఆదాయ వనరును ఎంచుకుని, అవినీతికి పాల్పడుతున్నారు. కొందరు ఇసుక మాఫియాతో మిలాఖత అయ్యారు. మరికొందరు ప్రేమ జంటలను టార్గెట్ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారిని పట్టుకోవడం.. సెల్‌ఫోనలు లాక్కోవడం, బెదిరించి ...
వైసీపీ వారి ఇసుక అక్రమాలకు సహకారం..
ప్రేమ జంటలు.. మందుబాబులకు చుక్కలు
లోడ్ వాహనదారులు రాత్రిళ్లు కప్పం కట్టాల్సిందే
అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన పరిధిలో భారీగా అక్రమాలు
బుక్కరాయసముద్రం, సెప్టెంబరు 27: ఆ స్టేషన సిబ్బందిలో కొందరు విధి నిర్వహణ కంటే కాసుల వేటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. డ్యూటీ దిగేలోగా జేబులు నింపుకుంటున్నారు. ప్రతి రోజు టార్గెట్ పెట్టుకుని మరీ దందాలకు దిగుతున్నారు. ఒక్కొక్కరు ఒక్క ఆదాయ వనరును ఎంచుకుని, అవినీతికి పాల్పడుతున్నారు. కొందరు ఇసుక మాఫియాతో మిలాఖత అయ్యారు. మరికొందరు ప్రేమ జంటలను టార్గెట్ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించేవారిని పట్టుకోవడం.. సెల్‌ఫోనలు లాక్కోవడం, బెదిరించి డబ్బులు గుంజడం పరిపాటిగా మారింది. నైట్ డ్యూటీలో ఉన్నవారిలో కొందరు ప్రతి వాహనాన్ని నిలబెట్టి వసూలు చేస్తున్నారు. సమస్యలతో స్టేషన గడప తొక్కితే పిండేస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న
బుక్కరాయసముద్రం అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన పరిస్థితి ఇది.
వైసీపీ నేతలతో మిలాఖత
వైసీపీ ప్రభుత్వ హయాంలో మండలంలో ఎర్రమట్టి, ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగింది. అధికారం మారినా వైసీపీ నేతల దందా కొనసాగుతోంది. దీనికి కొందరు పోలీసు, రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని సమాచారం. టీడీపీ వర్గీయులు ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా ఇటీవల పట్టుకుని కేసు నమోదు చేయించారు. వైసీపీ వారి ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని.. కేసు నమోదు చేయకుండా వదిలేశారు. మూడు రోజుల క్రితం ఓపెనఎయిర్ జైలు వద్ద వైసీపీవారి ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని వదిలేయడం దీనికి నిదర్శనం. అధికారంలో ఉన్నా తమ ట్రాక్టర్లు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారని, అధికారం కోల్పోయినా వైసీపీ వర్గీయుల ట్రాక్టర్లును వదిలేస్తున్నారని కొందరు టీడీపీ వర్గీయులు విమర్శిస్తున్నారు. గతంలో ఉన్న పరిచయాలతో వైసీపీ వారి ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ప్రేమ జంటలకు చుక్కలు
మండలంలో ఎక్కడైనా ప్రేమ జంట కనిపిస్తే కొందరు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఓ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఇటీవల ప్రేమ జంట కనిపించగానే ఓ కానిస్టేబుల్, హోంగార్డు వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే తల్లితండ్రులు పిలిపిస్తామని, కేసు నమోదు అవుతుందని బెదరించినట్లు సమాచారం. ఇలా ప్రేమ జంటలు కనబడితే బెదిరించి డబ్బులు గుంజుగున్నారని ప్రచారం జరుగుతోంది.
మందు కొడుతూ దొరికితే..
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరం. ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానా విధించాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు ఉన్నాయి. ఇదే అదనుగా సిబ్బందిలో కొందరు మద్యం సేవించేవారిని వేటాడుతున్నారు. పట్టుబడితే పండుగ చేసుకుంటున్నారు. ఫోనలు లాక్కుని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. కోర్టుకు వెళ్లి జరిమానా కట్టాలని ఎర వేస్తున్నారు. దెబ్బకు మందుబాబుల మైకం దిగి.. డబ్బులు ఇచ్చి బయట పడుతున్నారని సమాచారం.
నిలబెట్టి వసూలు
నిత్యం రద్దీగా ఉండే అనంతపురం-తాడిపత్రి రోడ్డులో రాత్రి సమయాల్లో వెళ్లే వాహనాలను కొందరు నిలబెట్టి మరీ వసూలు చేస్తున్నారు. రాత్రి విధుల్లో ఉండే సిబ్బంది, హొంగార్డులు వాహన తనిఖీ పేరిట రూ.50 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. బండల ట్రాక్టర్లు, సిమెంట్ లారీలు, మార్కెట్‌కు వెళ్లే వాహనాలు, ఇసుక ట్రాక్టర్లు, రాళ్ల లోడ్ వాహనాలు... ఇలా ఏవైనా సరే కప్పం కట్టి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నైట్ డ్యూటీ సిబ్బందిలో కొందరు గస్తీ వదిలేసి అక్రమ వసుళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అక్రమాలకు పాల్పడితే చర్యలు..
విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు. వసూళ్లకు పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ చేయిస్తాం. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై కేసులు నమోదు చేస్తాం. బుక్కరాయసముద్రంలో సిబ్బంది కొరత ఉంది. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఒక ఎస్‌ఐని నియమిస్తాం. బ్లూ కోల్ట్ సిబ్బందిపై నిఘా ఉంచుతాం.
- వెంకటేశ్వర్లు, అనంతపురం రూరల్ డీఎస్పీ
మరిన్ని అనంతపురం వార్తల కోసం....