Satya Kumar: వైసీపీ హయాంలో ఆరోగ్యశాఖ అనారోగ్య శాఖ అయ్యింది: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Jun 20 , 2024 | 09:21 PM
ఎమ్మెల్యేగా గెలవడం, ఆపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంపై ధర్మవరం (Dharmavaram) బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్(Minister satyakumar) స్పందించారు. తన గెలుపు కార్యకర్తలు పెట్టిన భిక్ష అంటూ భావోద్వేగానికి లోనైయ్యారు.
శ్రీ సత్యసాయి జిల్లా: ఎమ్మెల్యేగా గెలవడం, ఆపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంపై ధర్మవరం(Dharmavaram) బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్(Minister satyakumar) స్పందించారు. తన గెలుపు కార్యకర్తలు పెట్టిన భిక్ష అంటూ భావోద్వేగానికి లోనైయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. గల్లీ, ఢిల్లీలో ఉన్నవారిని నాయకులను చేసింది కేవలం బీజేపీ మాత్రమేనని సత్యకుమార్ అన్నారు. పదవుల కోసం ఎదురు చూపులు అవసరం లేదని, ప్రతి కార్యకర్త ఏదో ఒక రోజు ఎమ్మెల్యే, ఎంపీ అవుతారని మంత్రి చెప్పారు. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని సామాన్య కార్యకర్తకి సైతం బీజేపీ అధిష్ఠానం అవకాశం కల్పిస్తుందన్నారు. పదవుల్లో ఇవాళ మేము రేపు మరొకరు అని మంత్రి చెప్పారు.
బీజేపీ ప్రాబల్యం తగ్గిందని ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రయోజనం లేదని, భగభగ మండే సూర్యుడు నరేంద్ర మోడీ మళ్లీ గెలిచారని మంత్రి సత్యకుమార్ కొనియాడారు. పదేళ్లపాటు మోడీ ప్రధానిగా ఉన్నారని, అప్పటి ఓట్లే ఇప్పుడూ వస్తే ఆదరణ ఎలా తగ్గినట్లని ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా అభివృద్ధి దిశగా ఏపీ ప్రజలు ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు. పులివెందులకు ఒక వైపు ధర్మవరం మరో వైపు జమ్మలమడుగు కాషాయం అయ్యిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ఆరోగ్య శాఖలో రూపాయి బిల్ల లేదని, అంతా అప్పులే అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులు చెబుతుంటే నమ్మలేకపోయానని చెప్పారు.
కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని, జగన్ హెల్త్ డిపార్ట్మెంట్‌లో చేసిన లీలలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా తనకు ప్రజలు బాధ్యతలు అప్పగించారని, కానీ ఖజానాలో మాత్రం చిల్లిగవ్వలేదన్నారు. ఈ శాఖలో వేల కోట్లు అప్పులు ఉన్నాయని, ప్రజలు ఆరోగ్యం కోసం శాయశక్తుల పని చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భాగస్వామిగా బీజేపీ ఉందని, కొన్ని పరిమితులకు లోపడి పార్టీని విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రతి కార్యకర్తకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ స్థాయిలో తనను ఉంచిన నియోజకవర్గ ప్రజలకు మంత్రి సత్యకుమార్ ధన్యవాదాలు తెలిపారు.