Share News

Banana : గల్ఫ్‌కు అనంత అరటి

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:10 AM

గల్ఫ్‌ దేశాలకు అనంత అరటి ఎగుమతి అవుతోంది. ఈ సీజనలో తొలిసారిగా తాడిపత్రి రైల్వే స్టేషన నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బనానా రైలు ముంబాయికి అరటి దిగుబడులతో బయలుదేరనుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ బనానా రైలును విజయవాడ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. పెద్దపప్పూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో 45 మంది రైతులు పండించిన అరటి దిగుబడులను 34 కంటైనర్లల్లో తరలిస్తారు. మొత్తం రూ.1.50 కోట్ల విలువైన 680 మెట్రిక్‌ టన్నుల అరటిని ...

Banana : గల్ఫ్‌కు అనంత అరటి
Workers preparing banana harvest for export

నేడు తాడిపత్రి నుంచి ముంబయికి బనానా రైలు

రైతుల నుంచి అరటి పంటను కొన్న ఎస్‌కే బనానా కంపెనీ

రూ.1.50 కోట్ల విలువైన 680 మెట్రిక్‌ టన్నుల అరటి ఎగుమతి

అనంతపురం అర్బన/తాడిపత్రి నవంబరు 21(ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌ దేశాలకు అనంత అరటి ఎగుమతి అవుతోంది. ఈ సీజనలో తొలిసారిగా తాడిపత్రి రైల్వే స్టేషన నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బనానా రైలు ముంబాయికి అరటి దిగుబడులతో బయలుదేరనుంది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ బనానా రైలును విజయవాడ నుంచి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. పెద్దపప్పూరు, పుట్లూరు, యాడికి మండలాల్లో 45 మంది రైతులు పండించిన అరటి దిగుబడులను 34 కంటైనర్లల్లో తరలిస్తారు. మొత్తం రూ.1.50 కోట్ల విలువైన 680 మెట్రిక్‌ టన్నుల అరటిని తరలించనున్నారు. గుజరాతకు చెందిన ఎస్‌కే బనానా కంపెనీ రైతుల నుంచి అరటిని కొనుగోలు చేసింది. ఆ సంస్థ గల్ఫ్‌ దేశాలకు అనంత అరటిని ఎగుమతి


చేస్తోంది. రైతుల వద్ద కిలో రూ.20 నుంచి రూ.22 ప్రకారం కొనుగోలు చేస్తోంది. విదేశాలకు ఉద్యాన పంటలను ఎగుమతి చేసేందుకు 2016లో రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరేళ్లుగా దేశాయ్‌, ఐఎనఐ తదితర కంపెనీల అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తోంది. 2020 జనవరిలో కిసాన రైలు ద్వారా జిల్లా నుంచి అరటితోపాటు పలు రకాల ఉద్యాన పంటలను ఢిల్లీకి పంపారు. ఆ తరువాత రెండేళ్లకు కిసాన రైలు బంద్‌ అయ్యింది. అప్పటి నుంచి ప్రభుత్వంతో ఒప్పందం కుర్చుకున్న పలు కంపెనీలు రైతులలో అరటి పంటను కొనుగోలు చేసి, లారీలలో తరలిస్తున్నాయి. ఈ ఏడాది తిరిగి బనానా రైలు సేవలు మొదలయ్యాయి.

జిల్లా అరటికి భలే గిరాకీ

2018-19లో మొట్టమొదటిసారి జిల్లాలో ఫ్రూట్‌కేర్‌ యాక్టివిటీని ఆరంభించారు. జిల్లాలో 10,496 హెక్టార్లల్లో అరటి సాగవుతోంది. ఎక్కువ శాతం పుట్లూరు, యల్లనూరు, యాడికి, నార్పల, పెద్దపప్పూరు, బుక్కరాయసముద్రం మండలాల్లో అరటి పంట ఉంది. ఏటా 8.31 లక్షల మెట్రిక్‌ టన్నుల అరటి దిగుబడి వస్తోంది. టిష్యూ కల్చర్‌తో తయారు చేసిన జి-9 రకం అరటిని జిల్లాలో సాగు చేస్తున్నారు. డ్రిప్‌ ఇరిగేషన ద్వారా నీటితోపాటు ఎరువులు ఇవ్వడం ద్వారా నాణ్యమైన అరటిని రైతులు పండిస్తున్నారు. ఒప్పందం కుర్చుకున్న కంపెనీల ప్రతినిధులు అరటి సాగుపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆధునిక పద్ధతులను రైతులకు అలవాటు చేశారు. తద్వారా ఇతర జిల్లాల్లో పండించే అరటి కంటే అనంత అరటికి గిరాకీ పెరిగింది. జిల్లాలో అరటి కొనుగోలుకు 15 దాకా కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఆరేళ్ల నుంచి 10 కంపెనీల ద్వారా 1.59 లక్షల మెట్రిక్‌ టన్నుల అరటిని ఎగుమతి చేశారు. గల్ఫ్‌ దేశాలైన ఇరాన, సౌదీ అరేబియా, ఖతార్‌, దుబాయ్‌కి అనంత అరటి వెళుతోంది. 2018లో 18,500 మెట్రిక్‌ టన్నులు, 2019లో 23వేల మెట్రిక్‌ టన్నులు, 2020లో 43 వేలు, 2021లో 61 వేలు, 2022లో 63 వేలు, 2023లో 63 వేల మెట్రిక్‌ టన్నుల అరటిని వివిధ కంపెనీల ద్వారా విదేశాలకు ఎగుమతి చేశారు.

ఏర్పాట్ల పరిశీలన

తాడిపత్రి రైల్వే స్టేషనలో బనానా రైలు ప్రారంభోత్సవ ఏర్పాట్లను జేసీ శివనారాయణశర్మ గురువారం పరిశీలించారు. విజయవాడ నుంచి శుక్రవారం మధ్యాహ్నం మంత్రులు అచ్చన్నాయుడు, పయ్యావుల కేశవ్‌ వర్చువల్‌గా బనానా రైలును ప్రారంభిస్తారని జేసీ తెలిపారు. కార్యక్రమానికి కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ వస్తారని తెలిపారు. అనంతరం చుక్కలూరు వద్ద ఉన్న సిద్ధార్థ కోల్డ్‌కేర్‌ యూనిట్‌లో బనానా ప్యాకింగ్‌ను తనిఖీ చేశారు.

లక్ష మెట్రిక్‌ టన్నుల లక్ష్యం..

ఈ ఏడాదిలో లక్ష మెట్రిక్‌ టన్నుల అరటిని విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యం పెట్టుకున్నాము. ఈ సీజనలో తొలి సారి తిరిగి బనానా రైలు ద్వారా గల్ఫ్‌ దేశాలకు 680 మెట్రిక్‌ టన్నుల అర టిని ఎగుమతి చేస్తున్నాము. మార్చి దాకా అరటి దిగుబడి వస్తుంది. అప్పటిలోగా లక్ష్యం మేరకు లక్ష మెట్రిక్‌ టన్నుల అరటిని ఎగుమతి చేస్తాం. -నరసింహారావు, జిల్లా ఉద్యాన అధికారి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 22 , 2024 | 12:10 AM