YSRCP: వైసీపీ అధిష్టానంపై మండిపడ్డ కదిరి మాజీ ఎమ్మెల్యే
ABN , Publish Date - Jul 11 , 2024 | 12:35 PM
Andhrapradesh: వైసీపీ అధిష్టానంపై కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మండిపడ్డారు. ప్రాణాలు తెగించి పార్టీ కోసం పని చేస్తే సస్పెండ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ మోసం చేసిందంటూ సిద్ధారెడ్డి కంటతడి పెట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లా, జూలై 11: వైసీపీ అధిష్టానంపై (YSRCP) కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి (Kadiri Former MLA Sidda Reddy) మండిపడ్డారు. ప్రాణాలు తెగించి పార్టీ కోసం పని చేస్తే సస్పెండ్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ మోసం చేసిందంటూ సిద్ధారెడ్డి కంటతడి పెట్టారు. వైసీపీని మోసం చేయలేదని.. ఎలాంటి నోటీస్.. వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చాంద్ బాషా పార్టీ ఫిరాయించినా పది సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేశానన్నారు.
కదిరి నియోజకవర్గంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏనాడు పిలిచి మాట్లాడలేదన్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కదిరికి వచ్చినా కనీసం పిలిచి మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు. డబ్బుల కోసం అనామకులకు వైసీపీ టికెట్ ఇచ్చారన్నారు. కోవర్టుల వల్లే కదిరి నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోయిందన్నారు. అనామకుడికి వైసీపీ టికెట్ ఇవ్వడంపై స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు వ్యతిరేకించిన పార్టీ అధిష్టానం పట్టించుకోలేదన్నారు. పులివెందులకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కదిరి నియోజకవర్గ సమాచారం జగన్‌కు తెలియదన్నారు. అధికార పక్షానికి సహకరిస్తానని... అందరితో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వెల్లడించారు.
కాగా.. మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డిని సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో సిద్దారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు ఫిర్యాదు వెల్లువెత్తడంతో వైసీపీ అధిష్టానం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాల టాక్.
ఇవి కూడా చదవండి...
Vishnukumar Raju: స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవకూడదనేది అందరి భావన
AP News: అనకాపల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు
Read Latest AP News And Telugu News