Share News

POSTAL BALLOT : ఏమీ మారలేదు..!

ABN , Publish Date - May 06 , 2024 | 12:41 AM

ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు దక్కడం లేదు. సాధ్యమైనంతమేరకు ఓటింగ్‌కు వారిని దూరంగా పెట్టాలని చూస్తున్నారేమో అన్న అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడో రోజు ఆదివారం కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌పై గందరగోళం కొనసాగింది. ఎన్నికల సిబ్బందికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, అంతర్‌ జిల్లా ఓటర్లకు డ్వామా ...

POSTAL BALLOT : ఏమీ మారలేదు..!
Employees and teachers waiting to vote in a government junior college

మూడోరోజూ గందరగోళం

పోస్టల్‌ ఓటరు జాబితాపై గోప్యం

డ్వామా వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళన

అనంతపురం టౌన, మే 5: ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు దక్కడం లేదు. సాధ్యమైనంతమేరకు ఓటింగ్‌కు వారిని దూరంగా పెట్టాలని చూస్తున్నారేమో అన్న అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడో రోజు ఆదివారం కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌పై గందరగోళం కొనసాగింది. ఎన్నికల సిబ్బందికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, అంతర్‌ జిల్లా ఓటర్లకు డ్వామా కార్యాలయంలోనూ పోలింగ్‌ కొనసాగించారు. డ్వామా కార్యాలయంలో పోలింగ్‌ అధికారులు ఓటర్ల జాబితాను బయట ప్రదర్శించలేదు, ఓటర్లకు చూపలేదు. దీంతో త్వరగా ఓటు వేసి వెళ్లాలని భావించినవారు.. తమ పేరు జాబితాలో ఉందో లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గంటల తరబడి వేచి చూసినా అధికారులు


స్పందిచకపోవడంతో ఓపిక నశించి.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ‘ఉయ్‌ వాంట్‌ జస్టిస్‌’ అని నినాదాలు చేశారు. దెబ్బకు పోలింగ్‌ అధికారులు దిగొచ్చి జాబితాను బయటకు ఇచ్చారు.

వైసీపీకి పరోక్ష మద్దతు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల అధికారులు పరోక్షంగా వైసీపీకి సహకరించారు. అభ్యర్థులకు పోస్టల్‌ ఓటర్ల జాబితాను ముందుగా ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోలేదు. టీడీపీ అభ్యర్థి తరఫున అడిగితే కామనగా తయారు చేసిన జాబితాను ఇచ్చారు. దీంతో పేర్లు చూడడానికి టీడీపీ వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే వైసీపీ వారికి మాత్రం సీరియల్‌ నరంబర్లతో కూడిన ఓటరు జాబితా ఇచ్చారు. ఓటింగ్‌లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో.. చాలామంది ఓట్లను చెల్లనివ్వకుండా కుట్రలు చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపించారు. గెజిటెడ్‌ అధికారి సంతకం లేకుండానే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేయిస్తున్నారని వాపోయారు.

మరో అవకాశంపై హర్షం

అనంతపురం, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో ఫారం-12 సమర్పించినా.. చాలామంది పేర్లు పోస్టల్‌ ఓటర్ల జాబితాలో కనిపించలేదు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఎన్నికల కమిషనకు సి-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా స్పందించారు. ఎన్నికల విధులకు నియమించిన ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా మరో అవకావం కల్పించారు. ఫెసిలిటీ సెంటర్‌కు ఎన్నికల డ్యూటీ ఆర్డర్‌, ఫారం-12, ఓటరు ఐడీకార్డు తీసికెళ్లి ఓటు వేయవచ్చని ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.


వైసీపీ కుట్రలు

గుంతకల్లు, మే 5: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ఆదివారం ఆలస్యమైంది. అధికారులు తొమ్మిది గంటలకు రాకపోవడంతో ఓటర్లు వేచిచూశారు. ఆ తర్వాత సిబ్బంది వచ్చినా.. మరో అరగంట తరువాత పోలింగ్‌ ప్రారంభమైంది. ఇక్కడ తిష్ట వేసిన వైసీపీ వర్గీయులు.. ఓటర్లను తప్పుదోవ పట్టించారు. అక్కడున్న వైసీపీ వర్గీయుడిని ఉద్యోగిగా పొరబడిన ఓ మహిళా ఉద్యోగి.. ఓటు ఐడీ అడిగారు. అతను తప్పు నంబరు ఇవ్వడంతో ఆమె పేరు ఓటరు జాబితా సీరియల్‌లో కనిపించలేదు. దీంతో సిబ్బంది ఓటు లేదని చెప్పారు. ఆ తరువాత విషయం తెలుసుకున్న ఆమె.. తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తికోసం వెతికారు. అతడు అక్కడి నుంచి జారుకోవడంతో టీడీపీ నాయకులు ఆర్వో దృష్టికి తీసుకు వెళ్లారు. రెండు రోజులుగా ఇలా పలువురిని తప్పుదారి పట్టించి, ఓటు వెయ్యకుండా చేశారని సమాచారం. ఎనిమిది మంది ఉపాధ్యాయుల పేర్లు ఓటరు జాబితాలో కనిపించకపోవడంతో టీడీపీ చీఫ్‌ ఎలెక్షన ఏజెంట్‌ బీఎస్‌ కృష్ణారెడ్డి వారిని ఆర్డీవో కార్యాలయం వద్దకు తీసుకెళ్లి.. ఆర్వో శ్రీనివాస రెడ్డికి ఫిర్యాదు చేయించారు. అక్కడ పేర్లను గుర్తించి, తర్వాత ఓట్లు వేయించారు. సాయంత్రం వరకూ మొత్తం 607 ఓట్లు పోలయ్యాయి.


పోస్టల్‌ బ్యాలెట్‌కు మరో అవకాశం

అనంతపురం విద్య, మే 5: పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈసీ మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 1వ తేదీ నాటికి ఫారం-12 సమర్పించని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ నెల 7, 8 తేదీల్లో సైతం ఫారం-12 ఇవ్వవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన సూచించింది. మంగళ, బుధవారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఫెలిసిటేషన కేంద్రాల్లో ఫారం-12 స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది.

సారీ.. ఇక్కడ కాదు..!

వెరీ సారీ.. ఇక్కడ కూడా కాదు..!

ఓపీఓలకు చుక్కలు చూపుతున్న ఆర్వోలు

దరఖాస్తు చేసినచోట..

ఓటు హక్కు ఉన్నచోట పేర్లు లేవు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుకోసం

ఉద్యోగులు, టీచర్ల తంటాలు

అనంతపురం విద్య, మే 5: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్ల కష్టాలు కొనసాగుతున్నాయి. ఓటు హక్కు దక్కాలంటే పోరాటం చేయాల్సి వస్తోంది. అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్లు(ఓపీఓ) ఎక్కడ ఓటు వేయాలన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఓపీఓ డ్యూటీ పడిన ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. తాము ఓటు ఎక్కడ వేయాలని ఆర్వోలను అడుగుతున్నా.. ఒకరిపై ఒకరు తోసేసుకుంటున్నారు. ఓటు వేసేందుకు సోమవారం వరకూ మాత్రమే గడువు ఉంది. అయినా ఆదివారం సాయంత్రం వరకూ వారికి క్లారిటీ ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తగా వందలాది మంది ఉద్యోగులది ఇదే పరిస్థితి.

ఇక్కడా లేదు.. అక్కడా లేదు..

మడకశిర నియోజవకర్గంలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడికి (ఓపీఓ) ఉరవకొండ నియోజకవర్గంలో ఓటు ఉంది. ఆయన ఫాం-12 మడకశిరలో అందజేశారు. ఓటు సోమవారం వేయాల్సి ఉండగా.. ఆదివారం ఉరవకొండలోని ఎన్నికల అధికారులను ఆరా తీశారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఓటు లేదని ఆయనకు తెలిపారు. ‘మీరు పనిచేస్తున్న నియోజకవర్గంలోనే ఫాం-12 ఇచ్చారు కాబట్టి.. అక్కడే అడగండి’ అని ఉచిత సలహా ఇచ్చారు.


దీంతో ఆయన మడకశిర నియోజకవర్గ ఎన్నికల అధికారులను అడిగారు. వారు కూడా ఇలాగే బదులిచ్చారు. ‘లేదు లేదు. మీకు ఓటు ఎక్కడుందో అక్కడికే వెళ్లి ఓటు వేయండి’ అని సలహా ఇచ్చారు. రెండు నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు ఇలా చెప్పడంతో ఆ ఉపాధ్యాయుడు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వందలాది మంది ఓటర్లలో ఇదే తరహా అయోమయం నెలకొంది.

ఆర్వోల నిర్లక్ష్యం...?

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫారం-12ను అందజేశారు. వీటిపట్ల కొందరు ఆర్వోలు తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు కనిపిస్తోంది. ఓటు హక్కు ఉన్నచోట, దరఖాస్తు చేసినచోట.. ఎక్కడా ఓటరు జాబితాలో పేర్లు కనిపించడం లేదని వందల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఓపీఓల ఓట్లపై తీవ్ర గందరగోళం నెలకొంది. మొదట్లో ఓపీఓలు తమ ఓటు హక్కు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆరో తేదీలోగా ఓటు వేయాలని గడువు ఇచ్చారు. ఆ తరువాత 8వ తేదీ వరకూ గడువు పెంచారు. కొన్నిచోట్ల ఓపీఓలు ఎక్కడ ఓటు వేయాలనే స్పష్టత ఇవ్వడం లేదు. ఎన్నికల అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 06 , 2024 | 12:41 AM