Paritala Sunita : ఆ కులాలకు జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు
ABN , Publish Date - Feb 12 , 2024 | 03:08 PM
బీసీలు అంటే వైసీపీకి బ్యాక్ బోన్ అంటూనే.. ఆ కులాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunita) అన్నారు.
శ్రీసత్యసాయి జిల్లా: బీసీలు అంటే వైసీపీకి బ్యాక్ బోన్ అంటూనే.. ఆ కులాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunita) అన్నారు. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండల కేంద్రంలో జయహో బీసీ కార్యక్రమం సోమవారం జరిగింది. భారీ బైక్ ర్యాలీతో సభ వేదిక వద్దకు సునీత చేరుకున్నారు. సభా వేదిక వద్ద జ్యోతిరావు పూలే, సీనియర్ ఎన్టీఆర్, పరిటాల రవి చిత్రపటాలకు సునీత పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ... బీసీల ఆత్మగౌరవం నుంచే తెలుగుదేశం పుట్టిందని.. ఎస్సీ, ఎస్టీలకు గౌరవం ఇవ్వాలని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తలిచారని చెప్పారు. ఆ రోజు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశంకు బీసీలు అండగా ఉన్నారన్నారు.
వైసీపీ అక్రమాలను ఎదిరించినందుకు 75 మందికి పైగా బీసీ నాయకులను ఆ పార్టీ నేతలు హత్య చేశారని.. 2,540 మందిపై దాడులు, దౌర్జ్యన్యాలు చేశారని మండిపడ్డారు. బీసీలను మానసికంగా దెబ్బతీయటానికి వారిపై 26వేల అక్రమ కేసులను వైసీపీ ప్రభుత్వం పెట్టిందని ధ్వజమెత్తారు.వైసీపీకి తొత్తులుగా మారినందుకు ఐఏఎస్, ఐపీఎస్‌లు జైలుకు వెళ్లారన్నారు. తమ కార్యకర్తలను ఇబ్బందులు పెడితే టీడీపీ అధికారంలోకి వచ్చాక సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. తమకు పదవులు ముఖ్యం కాదని.. రెడ్ బుక్‌లో నోట్ చేసుకున్న వారి భరతం పట్టడమే ముఖ్యమని టీడీపీ నేత లోకేష్ చెప్పారన్నారు. పరిటాల కుటుంబానికి అండగా నిలబడిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరించారు. పేరూరు ప్రాజెక్టు పూర్తి చేయలేని దద్దమ్మ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని మండిపడ్డారు. రైతన్నలు బాగుపడితే ప్రకాష్ రెడ్డికి నచ్చదని.. ఆయన ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని పరిటాల సునీత అన్నారు.