Botsa Satyanarayana: టీడీపీ విధానాలపై బొత్స సత్యనారాయణ ప్రశంసలు
ABN , Publish Date - Jun 30 , 2024 | 04:31 PM
టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన ప్రశ్నించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులైందని..
విశాఖపట్నం, జూన్ 30: టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన ప్రశ్నించారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులైందని.. ఆ పాలనపై తానిప్పుడే విమర్శలు చేయబోనని అన్నారు. ఇదే సమయంలో రూ. 4 వేలు పెన్షన్ ఇవ్వటం మంచిదేనని ప్రశంసించారు. మిగిలిన హామీలను కూడా అమలు చేసే శక్తి వారికి రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఇదే సమయంలో వీసీల రాజీనామాలపై బొత్స స్పందించారు. వీసీ ల రాజీనామాలను ప్రభుత్వం కోరటం తప్పు కాదన్నారు. వైసీపీ కార్యాలయాల్లోకి కూటమి నేతలు చొరబడితే తప్పు అంటున్నానని అన్నారు. గతంలో టీడీపీ ఆఫీస్‌పై తమ పార్టీ నేతలు చేసిన దాడి కూడా తప్పు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ పక్షాల వారు సంయమనం పాటించాలని బొత్స విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వలన కలిగే నష్టం కంటే జగన్ పాలన వల్లే నష్టం ఎక్కువైందని అంటున్నారని.. ఎప్పుడు నష్టం జరిగింది? ఎప్పుడు లాభం జరిగిందనేది లెక్కల్లో తేలుతుందని చెప్పారు బొత్స. ఇక తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను మీడియా ప్రతినిథులు ప్రస్తావించగా.. స్పందించేందుకు నిరాకరించారు. నిజాలు నిలకడగా తెలుస్తాయని వ్యాఖ్యానించారు. ఇక పార్టీ ఓటమిపై స్పందించిన బొత్స.. ప్రజలను తమను అంగీకరించలేదు కాబట్టే తాము ఓడిపోయామన్నారు.