Visakha Railway Zone: ఏపీకి శుభవార్త.. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్
ABN , Publish Date - Aug 19 , 2024 | 10:09 PM
విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయాల్సిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’పై (Visakha Railway Zone) కొన్నేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఆగస్ట్-19తో ఫుల్‌స్టాప్ పడింది. జోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందన్న మాటలు ఇకపై వినపడవ్.. కనపడవ్!.
అమరావతి/న్యూ ఢిల్లీ : విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయాల్సిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’పై (Visakha Railway Zone) కొన్నేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఆగస్ట్-19తో ఫుల్‌స్టాప్ పడింది. జోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందన్న మాటలు ఇకపై వినపడవ్.. కనపడవ్!. ఎందుకంటే.. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు కానుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) అధికారికంగా ప్రకటించేశారు. రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం, సమన్వయంతో పనిచేస్తాయన్నారు. ఇందుకు సంబంధించి భూకేటాయింపు, ఇతర అంశాలపై ఏపీ నుంచి పూర్తి సహకారం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
తీపి కబురు!
అతిత్వరలో జోన్ ఆఫీస్ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో భూముల అంశంలో అభ్యంతరాలపై కూటమి సర్కార్‌తో చర్చించామని.. ఇప్పుడు జోన్ ఏర్పాటుపై పూర్తిగా అడ్డంకులు తొలగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోందని.. ఏపీ ప్రజల ఆశలు త్వరలో నెరవేరబోతున్నాయని రాఖీ పౌర్ణమి పర్వదినాన అశ్వినీ వైష్ణవ్ తియ్యటి కబురు చెప్పారు. కాగా.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే నాటి నుంచే.. కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాల భూమిని సమకూర్చడంలో ఆలస్యకావడం.. దీంతో రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటులో జాప్యం జరుగుతూ వస్తోంది. కేంద్ర మంత్రి చేసిన తాజా ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసులతో పాటు ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆలస్యం ఎందుకు..?
ముడసర్లోవలో 52 ఎకరాల భూమిని జీవీఎంసీ అధికారులు రైల్వేకు ఇవ్వాల్సి ఉందని, వాటిని ఎప్పటి నుంచో అడుగుతున్నా ఇవ్వడం లేదని, అందుకే జోన్ పనులు ఆగిపోయాయి అన్నది.. ఇదంతా గత ప్రభుత్వం ఘనకార్యమే అని చాలా రోజులు వస్తున్న ఆరోపణ. ఆ భూములు రైల్వేకు అప్పగించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని కేంద్రం ఎన్ని సార్లు చెప్పిందో లెక్కలేదు. ముడసర్లోవలో భూములు రైల్వేకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదని కేంద్రం మండిపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ ప్రాంతంలో భూములు కొన్నారని, వాటి విలువ పెంచడానికే అప్పట్లో అవసరం లేకపోయినా అటు వైపు బీఆర్‌టీఎస్ కారిడార్ వేశారనే ప్రచారం జరిగింది. ఇక జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక.. ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో కొన్నాళ్లు పార్టీ బాధ్యతలు చూశారు. ఆ సమయంలో ముడసర్లోవ ప్రాంతంలో గల రిజర్వాయర్‌ను ప్రత్యేకంగా వెళ్లి పరిశీలించారు. నాటి జీవీఎంసీ కమిషనర్ సృజనను కూడా తీసుకువెళ్లి చుట్టూ ప్రహరీ నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత చాలా పరిణామాలే జరిగాయి. బీజేపీ, వైసీపీ రాజకీయ పోరాటంలో ఇప్పటికే విశాఖ జోన్ జాప్యం అయిందని.. ఇంకా దానిని వెనక్కి నెట్టడానికి కుట్ర జరుగుతున్నదనే ఆరోపణలు చాలానే వచ్చాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఒక్కో సమస్యకు పరిష్కారం లభిస్తోంది.