Share News

Polavaram: కేంద్రం శుభవార్త.. పోలవరంపై కీలక ముందడుగు

ABN , Publish Date - Jul 22 , 2024 | 06:12 PM

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది...

Polavaram: కేంద్రం శుభవార్త.. పోలవరంపై కీలక ముందడుగు

న్యూ ఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణం విషయంలో కీలక ముందడుగు పడింది. పోలవరం ప్రాజెక్ట్‌ మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో ప్రతిపాదనలకు కార్యరూపం దాల్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామంతో శరవేగంగా పనులు జరగనున్నాయి. కూటమి సర్కార్‌కు ఇదొక తియ్యటి కబురే అని చెప్పుకోవచ్చు. ఈ ప్రకటన తర్వాత.. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సహకారంతో పోలవరం సవాళ్ళను అధిగమిస్తూ ముందుకు వెళతామన్నారు. పోలవరానికి రావాల్సిన రూ. 12,157 వేల కోట్లు త్వరగా ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. ఇందులో 8 వేల కోట్ల రూపాయిలు పునరావసానికి ఖర్చు చేయాల్సి ఉందని చెప్పారు.


Chandrababu-And-Modi.jpg

ఫలించిన ప్రయత్నాలు..!

కాగా.. వైసీపీ పాలనలో కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఇష్టానుసారం వాడేసి ప్రాజెక్టును పట్టించుకున్న పాపాన పోలేదన్న ఆరోపణలు కోకొల్లలు. అందుకే కూటమి సర్కార్ రాగానే తొలుత పోలవరంపైనే సీఎం నారా చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం పోలవరం కోసమే కేటాయిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా.. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రుల దృష్టికి పలుమార్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధుల విషయాన్ని మాట్లాడారు. దీంతో పాటు.. పార్లమెంట్ సమావేశాలతో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి.ఆర్ పాటిల్‌ను ప్రత్యేకంగా కలిసి ఎంపీలు నిశితంగా వివరించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ కోసం రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. సో.. చంద్రబాబుతో పాటు ఎంపీల ప్రయత్నాలు ఫలించాయన్న మాట.


Kesineni-Chinni.jpg

భారీగా ఇవ్వాలని..!

ఇదిలా ఉంటే.. ఇవాళ పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేందుకు కేంద్రం భారీగా నిధులివ్వాలని ఎంపీ కేశినేని శివనాథ్ కోరడం జరిగింది. రూల్- 377 కింద పొల‌వ‌రం ప్రాజెక్ట్ నిధులపై ఆయన మాట్లాడి.. పోల‌వ‌రం నిర్మాణానికి కేంద్రం త‌గిన నిధులు విడుదల చేయాలని కోరారు. మిష‌న్ మోడ్ కింద పోల‌వ‌రం ప్రాజెక్ట్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకువ‌చ్చేందుకు ఏపీ ప్రభుత్వం చ‌ర్యలు చేపట్టిందన్న విషయాన్ని లోక్‌సభలో తెలియజేశారు. ప్రాజెక్ట్ పూర్తయితే దేశంలోని ఆరు రాష్ట్రాలకు ప్రయోజ‌నం కలుగుతుందన్న విషయాన్ని పార్లమెంట్‌లో కేశినేని చిన్ని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో సివిల్ పనులు 3.84%, భూ సేకరణ పనులు 3.89% మాత్రమే జరిగాయని.. 2019 నాటికి, సివిల్ పనులు 71.93%, భూసేకరణ పునరావాసం ప‌నులు 18.66% పూర్తి అయ్యాయని లోక్‌సభలో నిశితంగా ఎంపీ వివరించారు. పోల‌వ‌రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, భవిష్యత్తుకు ప్రాణాధారం అని కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు.

Updated Date - Jul 22 , 2024 | 06:44 PM