Chandrababu: రైతులకు 1000 కోట్లు విడుదల
ABN , Publish Date - Jul 05 , 2024 | 03:05 AM
గత వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా వదిలేసిన పాత బకాయిలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది.
ధాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించిన సర్కారు
రూ.1,659 కోట్లు పెండింగ్ పెట్టిన గత ప్రభుత్వం
సివిల్ సప్లయి్‌సను 36 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టేసింది
వైసీపీ హయాంలో బియ్యం మాఫియా వ్యవస్థీకృతం
కాకినాడ పోర్టు అడ్డాగా ద్వారంపూడి దోపిడీ
పేదల పొట్టగొట్టి దోచిన వారిని వదలం: మంత్రి నాదెండ్ల
ఎండీయూ వాహనాలపై సరైన నిర్ణయం: మంత్రి నాదెండ్ల
అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించకుండా వదిలేసిన పాత బకాయిలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లిస్తోంది. గత వ్యవసాయ సీజన్‌లో సేకరించిన ధాన్యానికి రూ.1,659 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. అందులో తొలి విడతగా రూ.1,000 కోట్లను కొత్త ప్రభుత్వం విడుదల చేసింది. ముందుగా ఏ రైతుల నుంచి ధాన్యం సేకరించారో ఆ క్రమంలోనే (ఫస్ట్ కమ్ ఫస్ట్) బకాయిలు చెల్లిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది రైతులకు బకాయిలు చెల్లిస్తున్నామని వివరించారు.
మిగిలిన రూ.659 కోట్ల బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. విజయవాడలోని పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం రైతులకు కూడా సకాలంలో సొమ్ములు చెల్లించకుండా రూ.1,659 కోట్ల వరకు బకాయిలు పెట్టింది. మరోవైపు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌లోకి వైసీపీ నేతలు చొరబడి ఏకంగా రూ.36,300 కోట్లమేర అప్పుల్లోకి నెట్టేశారు.
ఈ విషయాలన్నింటినీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన పెద్దమనసుతో రూ. 1,000 కోట్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని చెప్పారు’’ అని మంత్రి వివరించారు. కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం చేసిన దోపిడీ మామూలు వ్యవహారం కాదని, కాకినాడ పోర్టు నుంచే భారీ నెట్‌వర్క్‌తో బియ్యం మాఫియాను విస్తరింపజేశారని అన్నారు.
పేదల పొట్టగొట్టి దోపిడీకి పాల్పడినవారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని అన్నారు. 2027 వరకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఎండీయూ వాహనాల వల్ల సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌పై వేల కోట్ల భారం పడుతోందని, దీనిపై భాగస్వామ్య పక్షాలతో చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.