Share News

Theft: యాచకుల్లా నటన.. భక్తుల్లా ముసుగు

ABN , Publish Date - Sep 20 , 2024 | 02:21 AM

చంటి బిడ్డలను చంకన పెట్టుకుంటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేసేలా నటిస్తారు. అదును చూసి.. ఏమార్చి చోరీలకు పాల్పడుతుంటారు. తిరుమలలోనూ భక్తుల ముసుగులోనూ చేతివాటం చూపి.. డబ్బు, నగలు, మొబైల్‌ ఫోన్లు తస్కరిస్తుంటారు.

Theft: యాచకుల్లా నటన.. భక్తుల్లా ముసుగు

రూ.7 లక్షల విలువైన బంగారు నగల స్వాధీనం

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 19: చంటి బిడ్డలను చంకన పెట్టుకుంటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేసేలా నటిస్తారు. అదును చూసి.. ఏమార్చి చోరీలకు పాల్పడుతుంటారు. తిరుమలలోనూ భక్తుల ముసుగులోనూ చేతివాటం చూపి.. డబ్బు, నగలు, మొబైల్‌ ఫోన్లు తస్కరిస్తుంటారు. అలాంటి ఇద్దరు అంతర్రాష్ట్ర మహిళా దొంగలను తిరుపతి క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా క్రైం అదనపు ఎస్పీ నాగభూషణరావు మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం తూత్తికోరిన్‌ జిల్లా మంతితోప్పు గ్రామానికి చెందిన భగవత్‌ శారద, ఆర్‌.ప్రియ స్నేహితులు. ఏడేళ్లుగా వీరు తిరుమల, తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, వెంకటగిరి జాతర.. కొండపై రద్దీ రోజుల్లో వీరు ఇక్కడకు వస్తారు. తిరుపతిలోని శ్రీనివాసం, ఉచిత సత్రాలు వద్ద తలదాచుకుంటారు. అదును చూసి చోరీలకు పాల్పడుతుంటారు. తరచూ తిరుమలకు వెళ్లి.. అక్కడ ఉచిత బస్సులు ఎక్కే సమయంలో బాగా రద్దీగా ఉంటే భక్తుల బ్యాగుల్లోని విలువైన నగలు, నగదు, సెల్‌ఫోన్లు కొట్టేస్తుంటారు. ఈ క్రమంలో తిరుమలలో రెండు.. తిరుపతి పోస్టల్‌ కాలనీలో ఒక దొంగతనంపై క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీనిపై అదనపు ఎస్పీ నాగభూషణరావు నేతృత్వంలో క్రైం డీఎస్పీ రమణకుమార్‌, సీఐ అబ్బన్న, హెడ్‌కానిస్టేబుళ్లు మురళి, గోపికృష్ణ, రమేష్‌, కానిస్టేబుళ్లు మోహన్‌, ప్రసాద్‌తో ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. నిందితులు పాత నేరస్తులని.. గతంలో పలుసార్లు అరెస్టయ్యారని గుర్తించారు. ఈ క్రమంలో ఫొటోల ఆధారంగా గురువారం తెల్లవారు జామున విష్ణునివాసం వద్ద చంకలో బిడ్డలను పెట్టుకుని తిరుగుతున్న ఇద్దరు మహిళలను అనుమానించి.. విచారించారు.


దీంతో వీరి దొంగతనాలు బయటపడ్డాయి. వీరి నుంచి రూ.7 లక్షల విలువైన 70 గ్రాముల బంగారు నగలు, మూడు సెల్‌ఫోన్లు, రూ.6500 నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ రమణకుమార్‌, సీఐ అబ్బన్న, సిబ్బందికి రివార్డుల కోసం ఎస్పీకి ప్రతిపాదనలు పంపుతున్నట్లు అదనపు ఎస్పీ చెప్పారు. తిరుమల, తిరుపతిలో పోగొట్టుకున్న సుండుపల్లికి చెందిన లక్ష్మీదేవి 33 గ్రాములు, పోస్టల్‌ కాలనీకి చెందిన ఆదిలక్ష్మి 40 గ్రాముల బంగారు నగలు, అలూరుకు చెందిన శ్రీనివాసులుకు రూ.6500, కర్ణాటకకు చెందిన దాస్‌, గుంటూరుకు చెందిన నరేంద్రకు సెల్‌ఫోన్లను పోలీసులు అప్పగించారు.

Updated Date - Sep 20 , 2024 | 02:21 AM