Kanipakam: విమాన వాహనంపై గణనాథుడి విహారం
ABN , Publish Date - Sep 21 , 2024 | 01:45 AM
కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో శుక్రవారం వరసిద్ధుడు విమాన వాహనంపై విహరించారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 20: కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో శుక్రవారం వరసిద్ధుడు విమాన వాహనంపై విహరించారు.ఉభయదారులైన ఐరాలకు చెందిన దివంగత రామకృష్ణపిళ్ళై కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. రాత్రి ఉభయదారులు వరస తీసుకురావడంతో అలంకార మండపంలో స్వామి ఉత్సవ విగ్రహాలకు ఘనంగా పూజలు నిర్వహించి.. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను విమాన వాహనం (సప్పరం)పై ఉంచి కాణిపాక పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈవో గురుప్రసాద్, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, ఆలయ సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఇన్‌స్పెక్టర్లు విఘ్నేష్, రవి, ఉభయదారులు పాల్గొన్నారు.
పుష్పపల్లకి సేవకు భారీ ఏర్పాట్లు
కాణిపాకంలో స్వామికి శనివారం నిర్వహించనున్న పుష్పపల్లకి సేవకు ఉభయదారులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రఽధాన ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామి దర్శనార్థం ప్రత్యేక క్యూలైన్లను ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. లడ్డు, ప్రసాదాల కొనుగోలుకు ప్రత్యేక కౌంటర్లు పెడుతున్నారు.