AP NEWS: తిరుపతి జెయింట్ వీల్ ఘటనలో కాంట్రాక్టర్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Nov 05 , 2024 | 08:42 AM
శిల్పారామం ఘటనలో పోలీసులకు పలు అనుమానాలు వస్తున్నాయి. ఎలాంటి అనుభవం లేని మహిళ క్రాస్ జాయింట్ వీల్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. కాంట్రాక్టర్ ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి: తిరుపతిలోని శిల్పారామంలో గల గేమ్ జోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. క్రాస్ జాయింట్ వీల్ ఊడి కిందపడిన ప్రమాదంలో ఒకరు మృతి, మరో యువతికి తీవ్ర గాయాల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. గేమ్ జోన్ కాంట్రాక్టర్ ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకుని తిరుచానూరు పోలీసులు విచారణ చేపట్టారు. శిల్పారామం ఏఓ ఖాధర్ వలి, కాంట్రాక్టర్ ప్రభాకర్‌తో కుమ్మక్కు కావడంతోనే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిదేళ్లుగా ఎలాంటి బదిలీ లేకుండా శిల్పరామం ఏఓగా ఖాధర్ వలి పనిచేస్తున్న విషయం తెలిసిందే. గేమ్ జోన్‌లో తనిఖీలు నిర్వహించకపోవడం, ఏఓ నిర్లక్షమే ఈ ప్రమాదానికి కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. ఏఓ ఖాధర్ వలిపై రాష్ట్ర సీఈఓ స్వామి నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పలు అనుమానాలు..
శిల్పారామం ఘటనలో పోలీసులకు పలు అనుమానాలు వస్తున్నాయి. ఎలాంటి అనుభవం లేని మహిళ క్రాస్ జాయింట్ వీల్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. కాంట్రాక్టర్ ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన మహిళపై శిల్పారామం ఏఓ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు అన్నారు. మహిళ ప్రమేయాన్ని శిల్పారామం ఏఓ ఖదర్ వలి కప్పిప్పుచ్చుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ పుటేజీ కూడా మాయమవడంతో కాంట్రాక్టర్ ప్రభాకర్‌పై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల అదుపులో క్రాస్‌వీల్ యజమాని..
కాగా.. తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి సుబ్బారెడ్డినగర్‌కు చెందిన లోకేశ్వరి (25), చంద్రశేఖర్‌రెడ్డి కాలనీకి చెందిన గౌతమి స్నేహితులు. ఆదివారం కావడంతో వారిద్దరూ మరికొందరితో కలిసి శిల్పారామానికి వచ్చారు. క్యాంటీన్ వద్ద క్రాస్‌వీల్ (జెయింట్ వీల్ తరహా) ఎక్కారు. లోకేశ్వరి, గౌతమి ఒకే బాక్సులో కూర్చున్నారు. క్రాస్ వీల్ వేగంగా తిరుగుతుండగా వీరిద్దరూ కూర్చున్న బాక్సు ఉన్నట్టుండి విరిగిపోయింది. దీంతో సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి వీరిద్దరూ కింద పడిపోయారు. లోకేశ్వరి తలకు, నుదుటిపైన తీవ్రగాయాలయ్యాయి. గౌతమికి కూడా గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆటోలో రుయాకు తరలించగా.. లోకేశ్వరి అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. గౌతమిని మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రాస్‌వీల్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
గేమ్‌జోన్‌కు తాళం..
తిరుపతి- తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో గేమ్‌జోన్‌కు తాళం పడింది. ఆదివారం సాయంత్రం క్రాస్‌వీల్‌లో సీటు విరిగి లోకేశ్వరి కింద పడటంతో మృతిచెందగా, గౌతమి గాయపడిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతున్న గౌతమి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై శిల్పారామం సంస్థల సీఈవో స్వామినాయుడు ఇక్కడి ఏవో ఖాదరవల్లితో మాట్లాడారు. ఫిట్‌నెస్‌పై నిర్లక్ష్యంగా ఎందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శిల్పారామంలోని గేమ్‌జోన్‌లో గల ఆటవస్తువుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలన్నారు. సక్రమంగా ఉంటేనే తిరిగి గేమ్ జోన్‌ను పునరుద్ధరించాలని సూచించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Nagula chavithi: విజయవాడలో ఘనంగా నాగుల చవితి వేడుకలు
Read Latest AP News And Telugu News