Share News

Accident ప్రైవేటు బస్సు బీభత్సం

ABN , Publish Date - Aug 31 , 2024 | 01:34 AM

చిత్తూరు నగరంలో శుక్రవారం ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఎదురుగా వస్తున్న కారు ను ఢీకొని.. ఆ తర్వాత ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో.. అందులోని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత ఆటోనూ ఢీకొంది.

Accident ప్రైవేటు బస్సు బీభత్సం
బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించిన గణపతి (ఫైల్‌ ఫొటో) - ఆటోను ఢీకొన్న బస్సు

ప్రమాద స్థలంలోనే మృతి చెందిన కూలీ

చిత్తూరు, ఆగస్టు 30: చిత్తూరు నగరంలో శుక్రవారం ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఎదురుగా వస్తున్న కారు ను ఢీకొని.. ఆ తర్వాత ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో.. అందులోని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత ఆటోనూ ఢీకొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గుడిపాల మండలం రామభద్రాపురం పంచాయతీ చుక్కావారిపల్లెకు చెందిన గణపతి(58) కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. శుక్రవా రం ఆయన బ్యాంకు పనిపై చిత్తూరుకు వచ్చారు. గిరింపేట నుంచి తన బామ్మర్దితో కలిసి నగరంలోకి వెళుతున్నారు. అదే సమయంలో గుడిపాల నుంచి చిత్తూరు వైపుగా వస్తున్న ప్రైవేటు బస్సు కు బ్రేక్‌ ఫెయిలైంది. దీంతో గిరింపేట బస్‌స్టాప్‌ వద్ద వేగంగా వస్తూ కారును ఢీకొంది. ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో బైకుపై వెనుక కూర్చుని ఉన్న గణపతి అక్కడికక్కడే మృతిచెందగా.. బైకు నడుపుతున్న అతడి బామ్మర్దికి స్వల్ప గాయాలయ్యాయి. అయినా ఆగకుండా వెళుతున్న బస్సును ఆపాలని ఓ ఆటో డ్రైవరు ప్రయత్నించారు. బస్సుకు బ్రేక్‌ ఫెయిలైందనే విషయం తెలియక తన ఆటోను బస్సు ముందు ఉంచే ప్రయత్నం చేశారు.దీంతో ఆటోను ఢీకొని బస్సు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారు, ఆటోలో ఉన్న వారికి స్వల్పగాయాలు కాగా.. ద్విచక్రవాహనంలో వెళుతున్న కూలీ గణపతి మృతిచెందారు.


ఈ మేరకు ట్రాఫిక్‌ సీఐ నిత్యబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన ప్రైవేటు బస్సుపై ఇప్పటి వరకు 11 కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం. గతవారం సీఎంసీ ఆస్పత్రి వద్ద ఓ మహిళ ప్రమాదానికి కారణమైంది. అలాగే నంగమంగళం వద్ద కారును ఢీకొనడంతో గుడిపాల స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, జీజేఎం చారిటబుల్‌ ట్రస్టు నిర్వాహకుడు చెన్నకేశవులు నాయుడు, టీడీపీ నేతలు హేమాద్రి, బాలాజీ నాయుడు, పళణి, మురళి, జయచంద్ర తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అధికారుల సాయంతో పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Updated Date - Aug 31 , 2024 | 01:34 AM