Madanapalle Case: మదనపల్లె ఘటనలో కీలక పరిణామం.. అన్నీ బయటికొస్తున్నాయ్!
ABN , Publish Date - Jul 26 , 2024 | 09:26 PM
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై (Madanapalli fire incident) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు.
చిత్తూరు: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై (Madanapalli fire incident) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు. ఒక్కో బృందంలో టీం లీడర్‌గా డీఎస్సీ స్థాయి అధికారి ఉన్నారు. మదనపల్లి రెవిన్యూ డివిజన్‌కు సంబంధించి మొత్తం 11 మండలాల్లోని తాసిల్దార్ కార్యాలయాల్లో డిప్యూటీ తహల్దార్‌ల పర్యవేక్షణలో రికార్డుల తనిఖీలు చేపట్టారు. 22ఏ కి సంబంధించిన రికార్డులన్నింటిని ఆయా మండలాల నుంచి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. అయితే రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా శనివారం నాడు ఈకేసుపై మీడియాకు పలు కీలక విషయాలు వెల్లడించారు.
మదనపల్లెలో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోందని రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. వైసీపీనేత మాధవరెడ్డి ఇప్పటికి పరారీలోనే ఉన్నారని అన్నారు. దస్త్రాల దహనంపై 4 బృందాలు విచారణ చేస్తున్నాయని వివరించారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే నిజాలన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. కార్యాలయ సిబ్బందిని కూడా త్వరలో విచారిస్తామని తెలిపారు. త్వరలో శాఖాపరమైన చర్యలు చేపడతామని అన్నారు. మంటల్లో దగ్ధమైన రికార్డుల రికవరీకి అవకాశం ఉందని చెప్పారు. కలెక్టరేట్, తహసీల్దార్ ఆఫీసుల్లో రికార్డులు పరిశీలించామని అన్నారు. డీ పట్టాలు ఫ్రీహోల్డ్ అవుతాయనే ఘటన జరిగినట్టు అనుమానం ఉందని చెప్పారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో 2.16 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్‌లో ఉన్నాయని తెలిపారు. అందులో 4,400 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు. ఫ్రీ హోల్డ్‌పై ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ చేపట్టారని ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు.
కాగా.. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 21న(ఆదివారం రాత్రి) అగ్నిప్రమాదం సంభవించింది. ‘22ఏ’ సెక్షన్‌లో మంటలు వ్యాపించాయి. దాదాపు 25 విభాగాల్లోని ఫైళ్లు దగ్ధమయ్యాయి. అయితే అగ్నిప్రమాదానికి కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణం తొలత భావించినప్పటికీ... అది కాదని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హెలికాఫ్టర్‌లో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సోమవారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు పరిశీలించారు. చివరకు ఇది ప్రమాదం కాదని... ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా తేల్చారు.
అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం... అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్‌లోనే మంటలు వ్యాపించడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఫైళ్ల దగ్ధంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగిందో చెప్పాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఈ ఘటనపై ఒక్కరోజులోనే మూడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. స్వయంగా కలెక్టర్‌తో మాట్లాడి అగ్నిప్రమాదంపై ఆరా తీశారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాయలంలో అగ్నిప్రమాదం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఘటన జరిగిన తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొంతమంది పోలీస్, రెవిన్యూ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే కలెక్టర్‌కు ఆర్డీవో సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ ద్వారా సమాచారం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్డీవో, అక్కడ ఉన్న సీఐ వ్యవహారశైలిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.