Share News

TTD: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం

ABN , Publish Date - Jan 19 , 2024 | 08:32 PM

అయోధ్య ( Ayodhya ) లో ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీరామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

TTD: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి శ్రీవారి లడ్డూ ప్రసాదం

తిరుమల: అయోధ్య ( Ayodhya ) లో ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా (బాల రాముడు) విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీరామజన్మభూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ కార్యక్రమం కోసం లక్ష లడ్డూ ప్రసాదాలను టీటీడీ ( TTD ) ప్రత్యేకంగా తయారు చేసింది. నేడు (శుక్రవారం) తిరుమల నుంచి లక్ష లడ్డూలని ప్రత్యేక వాహనంలో తిరుపతికి టీటీడీ పంపింది. రేపు ( శనివారం) కార్గో విమానంలో లక్ష లడ్డూలను టీటీడీ అయోధ్యకి పంపనున్నది. 22వ తేదీన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అయోధ్య ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేయనున్నారు.

1-A.jpg

అయోధ్యకు లక్ష లడ్డూలు

అయోధ్యకు శ్రీవారి లడ్డూలను పంపించడం చాలా ఆనందంగా ఉందని తితిదే జేఈవో వీర బ్రహ్మం తెలిపారు. 22వ తేదీన రామ మందిరం ప్రారంభోత్సవానికి లడ్డూలను పంపించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. లక్ష లడ్డూలను నాణ్యమైన నెయ్యితో తయారు చేసినట్లు చెప్పారు. ప్రత్యేకమైన విమానం ద్వారా రేపు అయోధ్యకు పంపించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. లడ్డూలను తయారు చేసేందుకు ఇద్దరు పాలక మండలి సభ్యులకు సహకరించారని చెప్పారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి అయోధ్యకు తరలింపుకు పాలక మండలి సభ్యుడు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

3.jpg

కాగా.. అయోధ్యలో ఈ నెల 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. సరయూ నదీ తీరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం. భవ్యరామ మందిర వైభవం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది. అత్యంత ఖరీదైన మతపర నిర్మాణాల్లో ఈ రామమందిరం ఒకటిగా నిలిచిపోనుంది. అయితే, ప్రాణ ప్రతిష్ఠకు ముందే.. రామాలయం గర్భగుడిలో శుక్రవారం బాల రాముడి ప్రతిమను ఆలయ నిర్వాహకులు ప్రతిష్ఠించారు. ఆ సుందర బాలరాముడిని చూసేందుకు రెండు కనులు చాలవంటే అతిశయోక్తికాదు. శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు బాలరాముడి తొలి చిత్రాన్ని విడుదల చేశారు.

Updated Date - Jan 19 , 2024 | 08:32 PM