ఎమ్మెల్యే ఎందుకయ్యామా..
ABN , Publish Date - Oct 29 , 2024 | 01:56 AM
‘అనవసరంగా చెడ్డపేరు వస్తోంది. ఎమ్మెల్యేగా ఎందుకయ్యామా అని బాధేస్తోంది’ అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి వాపోయారు.
బాధేస్తోందన్న బొజ్జల సుధీర్
టీడీపీ, జనసేన నేతల వాగ్వాదంతో శ్రీకాళహస్తి సమీక్ష వాయిదా
గొడవలతో అర్ధంతరంగా ముగిసిన సత్యవేడు సమీక్ష
చంద్రగిరిలోనూ టీడీపీ, జనసేన నేతల వాగ్వాదం
తిరుపతిలో అధికారులపై కూటమి నేతల ఫిర్యాదు
ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ సూళ్లూరుపేట బీజేపీ నేతల ఫిర్యాదు
తిరుపతిలో ఇన్‌చార్జి మంత్రి ఎదుట జిల్లా కూటమి నేతల పంచాయితీ
తిరుపతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘అనవసరంగా చెడ్డపేరు వస్తోంది. ఎమ్మెల్యేగా ఎందుకయ్యామా అని బాధేస్తోంది’ అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి వాపోయారు. తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్‌లో సోమవారం రాత్రి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గాల వారీగా కూటమి నేతలతో సమావేశాలు నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ కూటమి నేతలతో మంత్రి సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన నియోజకవర్గంలో ఇసుక అధికంగా ఉండటంతో ఎవరు పడితే వారు తవ్వకాలకు, అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్నారు. వాళ్లంతా తన పేరు చెప్పి చెడ్డపేరు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుకపై కన్ను..
ఇరుగుపొరుగు నియోజకవర్గాల వారూ ఇక్కడి ఇసుకపై కన్నేసి దుర్వినియోగం చేస్తున్నారని, దాన్ని తనకు ఆపాదించి వైసీపీ అనుకూల మీడియా అప్రదిష్టపాలు చేస్తోందని వేదన చెందారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ఇసుక అక్రమాలను అడ్డుకోవాలే తప్ప ఇలా నిరాశగా మాట్లాడడం తగదంటూ ఆయన్ను మంత్రి సత్యప్రసాద్ అనునయించారు. గత ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయించాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. అప్పటి రెవెన్యూ అధికారులతో కలసి వైసీపీనేతలు పెద్ద ఎత్తున భూ రికార్డులు తారుమారు చేయడంతో ఇపుడు ప్రజల నుంచీ ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. వాటి పరిష్కారానికి ఇపుడున్న రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. భూ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఇసుక విషయంలో పాత వైసీపీ విధానాన్నే అనుసరిస్తున్నందున చెడ్డపేరు వస్తోందని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు అభిప్రాయపడ్డారు. అధికారులతో పకడ్బందీగా పనిచేయిస్తే చెడ్డపేరు రాదన్నారు. తమకు ఎలాంటి ప్రాధాన్యతా లేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదంటూ జనసేన ఇంఛార్జి నగరం వినుత తదితరులు ఫిర్యాదు చేశారు. వైసీపీపై పోరాడిన తమపై 17 అక్రమ కేసులున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా, టీడీపీ గెలుపునకు పనిచేయలేదని, ప్రచారానికి దూరంగా ఉన్నారని టీడీపీ నేతలూ ప్రత్యారోపణ చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల నడుమ వాగ్వాదం చోటుచేసుకోవడంతో మంత్రి సమావేశాన్ని ముగించారు. మంగళవారం ఉదయం మరోసారి సమావేశమవుదామని వాయిదా వేశారు.
వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకోవద్దు
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి నేతలను ఎన్నో ఇబ్బందులకు గురిచేసి, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలైన వైసీపీ కార్పొరేటర్లును టీడీపీలోకి చేర్చుకోవద్దంటూ పలువురు నేతలు ఇన్‌చార్జి మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఒక పార్టీ చేర్చుకోకపోతే మరో పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయికదా? అన్న మంత్రి ప్రశ్నకు.. కూటమి పార్టీలన్నీ ఒకే మాటపై ఉంటే వైసీపీ వాళ్లకు అవకాశం ఉండదని, రాబోయే ఎన్నికల్లో కూటమి పార్టీలో కష్టపడిన నాయకులకు కార్పొరేట్ టికెట్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. దీనిపై అధిష్ఠానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బదులిచ్చారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపైనా టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. వీఐపీల పర్యటనల్లో తమకు సమాచారం ఉండడంలేదని, వైసీపీ నాయకులతో అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెబుతుండగా..జనసేన నాయకులు ఖండించారు. తమ సమస్యలపై కమిషనరు మౌర్య స్పందించడం లేదని, ఆమెను బదిలీ చేయాలని టీడీపీ నాయకుడొకరు మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తిరుమలలో రెవిన్యూ విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారి అక్రమ దుకాణాల ఏర్పాటుకు కారకుడంటూ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని పలువురు మహిళా నేతలు కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, బొజ్జల సుధీర్, పులివర్తి నానీ, జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్, బీజేపీ నేత అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రగిరి జనసేన నేతపై ఫిర్యాదు
చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన నేత తీరుపై పలువురు టీడీపీ నాయకులు మంత్రికి ఫిర్యాదు చేశారు. తొలుత జనసేన నేత ఒకరు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, రాజకీయంగా అణగదొక్కేందుకు యత్నిస్తున్నారని ఆరోపించడంతో టీడీపీ నాయకులు ఎదురు దాడికి దిగారు. భూ వివాదాలు, కబ్జాల్లో తలదూర్చి కూటమి పార్టీలకు, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. వైసీపీ ముఖ్యనేతతో రాజీపడి, వైసీపీ వర్గీయులకు అనుకూలంగా సిఫారసులు చేస్తున్నారని పలు ఉదంతాలు ప్రస్తావించారు. ఓ మహిళా నేత తన వ్యక్తిగత సమస్య విషయంలో జనసేన నేత ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో మంత్రి సర్దిచెప్పారు. ఎమ్మెల్యే పులివర్తి నానీ మాట్లాడుతూ ఏ స్థాయి నాయకుడు సిఫారసు చేసినా తాను వైసీపీ వ్యక్తులకు పనులు చేయనని, వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వారి బదిలీలకు సిఫారసు చేయనని తేల్చి చెప్పారు.
అర్ధంతరంగా ముగిసిన ‘సత్యవేడు’ సమావేశం
సత్యవేడు సమీక్షకు సస్పెన్షన్‌లో ఉన్న కారణంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరు కాలేదు. నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త శ్రీపతి బాబు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంఛార్జులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే హేమలత కూడా హాజరు కావడంతో గొడవ జరిగింది. తొలుత ఎమ్మెల్యే అనుకూల వర్గానికి చెందిన నేతలు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై సస్పెన్షన్ విధించడంతో అభివృద్ధి పనులు జరగడం లేదని మంత్రి ఎదుట వాపోయారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండు చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓడిపోవాలనే ఉద్దేశంతో ఇండిపెండెంట్ అభ్యర్థికి అనుకూలంగా పనిచేసిన హేమలతను సమావేశానికి ఎలా పిలిచారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వైసీపీ వారికి పనులు చేస్తున్నారని, కాబట్టి సస్పెన్షన్ ఎత్తివేయకూడదని వ్యతిరేక వర్గ నేతలు పట్టుబట్టారు. తమకు ఎలాంటి ప్రాధాన్యతా ఇవ్వడం లేదంటూ జనసేన నేతలు మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సమావేశం రచ్చరచ్చగా మారడంతో వచ్చే నెల 10 లేదా 11న ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామంటూ మంత్రి సమీక్షను ముగించారు.
ఇది కూడా చదవండి:
సీఎంకాగానే మమ్మల్ని పక్కన పడేశారు