Share News

Chandrababu : జాతికి జగన్‌ ద్రోహం

ABN , Publish Date - Jun 29 , 2024 | 01:01 AM

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించినప్పుడు.. అక్కడి పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

Chandrababu : జాతికి జగన్‌ ద్రోహం

  • పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు: సీఎం

  • ఇది అహంకారంతో చేసిన దుస్సాహసం

  • ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్రం నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోంది

  • నిపుణులు ఏడాదిలో నివేదిక ఇవ్వాలి

  • డయాఫ్రం వాల్‌ నిర్మాణానికే రెండేళ్లు..

  • ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంకు మరో రెండేళ్లు

  • అంటే ప్రాజెక్టు పూర్తికి ఐదేళ్లు పట్టవచ్చు

  • జగన్‌ సీఎంకాగానే నిర్మాణాన్ని ఆపేశాడు

  • కేంద్రం వద్దన్నా కాంట్రాక్టరును మార్చాడు

  • మా హయాంలో రూ.11,762 కోట్ల ఖర్చు

  • ఈయన జమానాలో రూ.4,167 కోట్లే

  • డయాఫ్రం వాల్‌ను 436 కోట్లతో పూర్తిచేశాం

  • ఇప్పుడు మరమ్మతుకే రూ.447 కోట్లవుతుంది

  • సమాంతర వాల్‌కు మరో 990 కోట్లు కావాలి

  • అంచనా వ్యయం ఇంకో 33% పెరగొచ్చు: సీఎం

  • పోలవరంపై శ్వేతపత్రం విడుదల

అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పోలవరం ప్రాజెక్టును పరిశీలించినప్పుడు.. అక్కడి పరిస్థితిని చూస్తే కన్నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దానిని జగన్‌ గోదావరిలో ముంచేశారని మండిపడ్డారు. అహంకారంతో ఆయన చేసిన దుస్సాహసానికి ఫలితమే పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత దుస్థితిగా పేర్కొన్నారు. ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్రం నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

జగన్‌ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందన్నారు. శుక్రవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుపై ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. కళ్లలో నీళ్లు ఉబుకుతుండగా ఆపుకొంటూ ఈ సందర్భంగా మాట్లాడారు. 2014లో రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే జగన్‌ గత ఐదేళ్లలో చేసిన నష్టమే ఎక్కువన్నారు.

రాష్ట్రాన్ని నష్టం చేసే హక్కు ఎవరికీ లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి అమరావతి, పోలవరం రెండు కళ్లలాంటివన్నారు. పోలవరం వాస్తవ స్థితిగతులను ప్రజలకు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ధ్వంసం జాతికి జరిగిన విద్రోహంగా అభివర్ణించారు. 2014-19 మధ్య పోలవరానికి తమ ప్రభుత్వం రూ.11,762 కోట్లు ఖర్చు చేసిందని.. జగన్‌ రూ.4,167 కోట్లు మాత్రమే పెట్టారని చెప్పారు.


ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే అవగాహన లేకుండా నిర్మాణాన్ని జగన్‌ ఆపేశారని, దానివల్ల కలిగిన నష్టమే పోలవరం విధ్వంసమని చెప్పారు. పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో కేంద్రం వద్దన్నా కాంట్రాక్టు సంస్థను మార్చారని.. సమర్థులైన అధికారులను బదిలీ చేశారని ఆక్షేపించారు. 2009లోనూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాంట్రాక్టరును మార్చారని.. దానివల్ల 2013లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ట్రాన్స్‌ట్రాయ్‌ సంస్థను తీసుకొచ్చేదాకా పనులు సాగలేదన్నారు. ‘2019లో జగన్‌ కూడా కాంట్రాక్టరును మార్చారు. మార్చవద్దని సీఎ్‌సకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) లేఖ రాసింది. నీతి ఆయోగ్‌ బృందం నియమించిన ఐఐటీ హైదరాబాద్‌ కూడా జగన్‌ తప్పిదం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు మరమ్మతులపై సూచనలు చేయడానికి అమెరికా, కెనడా దేశాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులను కేంద్రం రప్పిస్తోంది. వారు ఏడాదిలో నివేదిక ఇవ్వాల్సి ఉంది.

ఆ తర్వాత కాఫర్‌ డ్యాంలో సీపేజీని నివారించాక.. డయాఫ్రం వాల్‌ నిర్మాణం కోసం రెండు సీజన్లు (రెండేళ్లు) పడుతుంది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం కట్టడానికి మరో రెండేళ్లు పడుతుంది. అంతా సజావుగా సాగితే మొత్తంగా ప్రాజెక్టు పూర్తవడానికి ఐదేళ్లు పట్టవచ్చు’ అని వివరించారు. కాంట్రాక్టు సంస్థను మార్చకపోతే 2020నాటికే పూర్తయ్యేదని స్పష్టం చేశారు. ప్రాంతాలూ కూలాలు, మతాలకు అతీతంగా జగన్‌ను అందరూ నిలదీయాలని పిలుపిచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


డయాఫ్రం వాల్‌ ఇప్పుడు కట్టాలంటే..

డయాఫ్రం వాల్‌ను మా హయాంలో రూ.436 కోట్లతో నిర్మించాం. ఇప్పుడు దెబ్బతిన్న ఆ వాల్‌కు మరమ్మతు చేసేందుకే రూ.447 కోట్లవుతుందని అంచనా. కొత్త సమాంతర వాల్‌ నిర్మాణానికి మరో రూ.990 కోట్లు అవుతుంది. పోలవరానికి జగన్‌ చేసిన విధ్వంసంతో ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులే మారిపోయాయి. ఆయన అసమర్థత కారణంగా గైడ్‌బండ్‌ కుంగిపోయింది. రూ.80 కోట్లతో నిర్మించిన ఈ గైడ్‌బండ్‌ నిరుపయోగంగా మారింది. మా హయాంలో ప్రాజెక్టు 72 శాతం పూర్తయితే.. జగన్‌ హయాంలో కేవలం 3.84 శాతం పనులే జరిగాయి.

వాస్తవాలు దాచి ప్రకటనలు..వాస్తవాలు దాచిపెట్టి పోలవరం పూర్తి చేస్తామని జగన్‌ అసెంబ్లీలో పలు సార్లు ప్రకటనలు చేశారు. ప్రాజెక్టు గరిష్ఠ స్థాయిలో 45.72 మీటర్ల కాంటూరులో 194 టీఎంసీల నీటి నిల్వ చేయాల్సిందే. కానీ జగన్‌ అకస్మాత్తుగా 41.15 మీటర్ల కాంటూరును తెరపైకి తెచ్చారు. ఇది ఆచరణయోగ్యం కాదు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమకు కూడా నీరందించవచ్చు. ముంపునకు గురయ్యే ఏడు మండలాలను 2014లో నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే రాష్ట్రంలో విలీనం చేయించాను. నాడు ఆ మండలాలవారంతా సమ్మతించారు. ఇప్పుడు జగన్‌ నిర్వాకంతో తెలంగాణకు వెళ్లిపోతామంటూ ఆందోళన చేసే పరిస్థితి తలెత్తింది.


నిర్వాసితులకు మోసం..

ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన రూ.3,385 కోట్లనూ జగన్‌ దారి మళ్లించారు. ఓట్ల కోసం నిర్వాసితులనూ మోసం చేశారు. వారికి ఇస్తానన్న ఎకరాకు రూ.15 లక్షలు, అదనంగా చెల్లిస్తానన్న రూ.5 లక్షలు కూడా చెల్లించలేదు. నిర్వాసితుల సమస్యలను చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. వీటిన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత నాపై ఉంది. జగన్‌ చేసిన పాపాల కారణంగా ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలు పోలవరంపై కేసులు వేశాయి. స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌కు రెండేళ్లకోసారి సడలింపులు తీసుకోవలసి వస్తోంది. నేను కట్టానన్న అక్కసుతోనే పట్టిసీమను పక్కన పెట్టేశారు.

పురుషోత్తపట్నం ఎత్తిపోతలను వాడుకోవలసి ఉంది. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకోవలసి ఉంది. 2019లో మేం వదిలివెళ్లే నాటికి రూ.1,771 కోట్ల విలువైన హెడ్‌వర్క్స్‌ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అవగాహన లేకుండా జగన్‌ పనులు నిలిపేశారు. కేంద్రం వద్దంటున్నా రివర్స్‌ టెండర్‌కు వెళ్లారు. రూ.1,548.13 కోట్లకు కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. పాతకాంట్రాక్టు సంస్థ చేసిన పనులకు జవాబుదారీతనం లేకుండా వదిలేశారు. కొత్త సంస్థ ఏడాది వరకూ నిర్మాణ ప్రాంతానికే వెళ్లలేదు. ఆ సంస్థను బాధ్యులను చేయాలంటే.. తాము బాధ్యతలు తీసుకునేలోపే డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నట్లు చెబుతోంది. వీటిన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంది.


ఒక వ్యక్తి ఇంత నష్టం చేయడం దుర్మార్గం

పోలవరాన్ని శిథిలం చేయడం ద్వారా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం దుర్మార్గమని సీఎం అన్నారు. రివర్స్‌ టెండర్‌ విధానంలో రూ.600 కోట్లకు పైగా ఆదా చేశామన్న జగన్‌.. ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి రూ.25 వేల కోట్ల మేర నష్టాన్ని తీసుకొచ్చారని.. పాపమెవరు చేశారో బాధ్యత కూడా వారే వహించాలని విలేకరి అన్నప్పుడు.. నిజమని చంద్రబాబు అంగీకరించారు. ప్రాజెక్టు డిజైన్లపై నిర్ణయం తీసుకునేందుకు జలసంఘం ఇంజనీర్లు కూడా భయపడ్డారని.. ఒక దుర్మార్గుడు తీసుకున్న చర్యకు బలైపోతామేమోనన్న భయం వారిలో ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ‘2020లో డయాఫ్రం వాల్‌ దెబ్బతింటే.. 2024 దాకా బుకాయిస్తూ వచ్చారు.

పోలవరం మరమ్మతుల కోసం రూ.15,511.13 కోట్లను కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. 2017-18 అంచనా వ్యయం మేరకు రూ.55,548.87 కోట్ల అంచనా ఇప్పుడు ఇంకో 33 శాతం పెరిగే వీలుంది. ప్రస్తుతానికి దెబ్బతిన్న కట్టడాల మరమ్మతులపైదృష్టి సారించాం. కేంద్రం సహకారంతో ముందుకు తీసుకెళ్తాం’ అని తెలిపారు.

ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష సుదీర్ఘంగా చేస్తుంటే ప్రాజెక్టు అధికారులు ఇబ్బంది పడుతున్నారని విలేకరులు ప్రస్తావించగా.. సమీక్ష సమయాన్ని తగ్గిస్తానని చంద్రబాబు బదులిచ్చారు. వర్చువల్‌గా నిర్వహిస్తామని కూడా తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంపై మేధావులు, నిపుణుల సలహాలూ తీసుకుంటామన్నారు. వెబ్‌సైట్లలో పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

  • నదుల అనుసంధానానికి పోలవరం గుండెలాంటిది. అలాంటి ప్రాజెక్టుకు జగన్‌ శాపంలా మారారు. ఈ ప్రాజెక్టు విషయంలో క్షమించరాని నేరం చేశారు.

  • పోలవరం నిర్మాణం నా జీవితంలో ఒక మధురఘట్టం. అందుకే రాష్ట్ర ప్రజలకు బస్సులు పెట్టి చూపించాం. నా మనవడు దేవాన్ష్‌ కూడా ప్రాజెక్టు గ్యాలరీలో సగం దూరం నడిచాడు.

  • నేను ఐదేళ్లపాటు పడిన శ్రమను జగన్‌ బూడిదలో పోసిన పన్నీరు చేశాడు. పోలవరం నిర్మాణంలో జాప్యం కారణంగా రైతులకు రూ.45,000 కోట్ల మేర పంట నష్టం వాటిల్లింది. సవరించిన రూ.55,548 కోట్ల అంచనా వ్యయం మరో 33 శాతం పెరిగే అవకాశం ఉంది.

  • పోలవరం ప్రధాన దోషి జగన్‌ను ప్రజలు ఇంటికి పంపేశారు. రివర్స్‌ టెండర్‌ పిలిచిన అధికారి ఆదిత్యనాథ్‌దాస్‌ తెలంగాణకు వెళ్లిపోయాడు. మరో అధికారిని కూడా పంపేశాం.

- సీఎం చంద్రబాబు

Updated Date - Jun 29 , 2024 | 06:09 AM